కేసీఆర్​ గారడి మాటలు నమ్మొద్దు

కేసీఆర్​ గారడి మాటలు నమ్మొద్దు

యాదాద్రి, వెలుగు: ‘సీఎం కేసీఆర్  ఊసరవెల్లి. వ్యవసాయంపై ఎన్ని మాటలు మార్చిండు. సన్నొడ్లు వేయమన్నడు.  ప్రతి గింజా కొంటనన్నడు. ఇప్పుడు వరి వద్దంటున్నడు. ఆయన పొలంలో ఏం పండుతుందో రైతులకు తెలీదా?  రాష్ట్రంలో కొన్నిచోట్ల వరి తప్పా ఏం పండదు.. కేసీఆర్​కు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా?’ అని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం మామిల్లగూడెంలో శనివారం ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. గుర్రాలదండి, మక్తానాయక్​ తండా, కొత్తతండా, జాంపల్లి, రెడ్యానాయక్​ తండా, పోచర్లబోడు తండా, చిన్నోళ్లబావి తండా మీదుగా పాదయాత్ర కొనసాగింది. భువనగిరి మండలం బొల్లేపల్లిలో షర్మిల ‘మాట- ముచ్చట’ నిర్వహించారు. అల్లుడొస్తే పండుకోవడానికి ఇంకో బెడ్రూం కావొద్దా అని కథలు చెప్పిన కేసీఆర్.. ఎంత మందికి ఇండ్లిచ్చాడని ఆమె ప్రశ్నించారు. ఇంటికి పెద్ద కొడుకునని ఓట్లేయించుకున్నాడని.. ఇంట్లో ఉన్న ఇద్దరు ముసలోళ్లకు ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదని నిలదీశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందుకే  మళ్లా గారడి మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఆయన మాటలు నమ్మొద్దని, ఎన్నికల కోసమే దొంగ హామీలు ఇస్తున్నాడని విమర్శించారు. 

బొల్లేపల్లిలో ఉద్రిక్తత

భువనగిరి మండలం బొల్లేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రకు సంబంధించిన ఫ్లెక్సీని కడుతుండగా.. అదే గ్రామానికి చెందిన టీఆర్​ఎస్​ కార్యకర్త శ్రావణ్​ అడ్డుకుని చింపివేయడంతోపాటు తమ కార్యకర్తలను కొట్టాడని ఆరోపిస్తూ వైఎస్సార్​టీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న షర్మిల వెంటనే అక్కడికి చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి, సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పాదయాత్ర నిర్వహించి తీరుతామని షర్మిల స్పష్టం చేశారు. 

రైతులతో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ రాజకీయం: దేవేందర్ రెడ్డి

వరి పంట చేతికొచ్చే దశలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కారు మాట మార్చిందని, కేంద్రంపై పోరాటం చేస్తామని కొత్త పాటపాడుతోందని వైఎస్సార్టీపీ రైతు విభాగం అధ్యక్షుడు తుడి దేవేందర్ రెడ్డి ఆరోపించారు. వరిసాగు చేసిన రైతులను గోస పెట్టి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటం దారుణమని శనివారం ప్రకటనలో మండిపడ్డారు.