కేటీఆర్‌‌ను సీఎం చేస్తామన్నది నిజమే .. అందుకు మోదీ ఆశీస్సులను అడిగినం: కేసీఆర్

కేటీఆర్‌‌ను సీఎం చేస్తామన్నది నిజమే ..  అందుకు మోదీ ఆశీస్సులను అడిగినం: కేసీఆర్
  • రహస్య చర్చను బయటపెట్టడం ప్రధానికి భావ్యమా?
  • 70 ఏండ్లు నిండాక రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనుకున్న
  • రాష్ట్రానికి మంచి చేస్తే ఎన్డీయేలో చేరుతానని చెప్పిన
  • టైమ్‌ వచ్చినప్పుడు దళితుడిని సీఎం చేస్తం
  • లిక్కర్​ స్కామ్​ కేసు ఓ కట్టుకథ... బీజేపీది కక్ష సాధింపు
  • ‘ఇండియా టుడే’ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో సీఎం కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ సీఎం అయ్యేందుకు ప్రధాని మోదీ ఆశీస్సులుండాలని కోరిన మాట వాస్తవమేనని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే ప్రైవేటుగా జరిగిన చర్చను ప్రధాని బయటపెట్టడం భావ్యమా అని ప్రశ్నించారు. కేటీఆర్ సీఎం అయ్యేందుకు కేసీఆర్ తన ఆశీస్సులు అడిగారని, ఎన్డీయేలో చేరుతామని చెప్పారని ఇటీవల ప్రధాని మోదీ సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న కేసీఆర్ తాజాగా స్పందించారు.

ఇండియా టుడే’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నాకు 70 ఏండ్లు రాగానే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మోదీతో చెప్పా. 50 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని వివరించా. అప్పుడు కేటీఆర్ గురించి మోదీ అడిగారు. మీరు ప్రధానిగా ఉన్నారు కాబట్టి కేటీఆర్​కు ‘మీ ఆశీస్సులుండాలి’ అని విజ్ఞప్తి చేశాను. కేటీఆర్‌‌కు సహకరించాలని కోరాను. అదంతా రహస్యంగా, ప్రైవేటుగా సాగిన సంభాషణ. రాజకీయ అవసరాల కోసం అలాంటి వాటిని రాజకీయ వేదికలపై ప్రధాని బయటపెట్టడం ఎంత వరకు సబబు?’’ అని ప్రశ్నించారు.

ఎన్డీయేలో చేరాలని మోదీనే అడిగారు

ప్రధాని మోదీ తన మైండ్‌లో మెదిలిందంతా చెప్పేస్తుంటారని, తనకు నచ్చినట్టు కథలు అల్లేస్తుంటారని సీఎం కేసీఆర్ విమర్శించారు. దానికి తానేమీ చేయలేనన్నారు. ‘‘ఒక సీఎంగా నేను కేంద్రంతో మంచి సంబంధాలను మెయింటెయిన్ చేయాలి. ఎన్డీయేలో చేరాలంటూ మోదీ నన్ను రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని నేను షరతు పెట్టాను. ఆ తర్వాతే ఎన్డీయేలో భాగస్వామిని అవుతానని తేల్చిచెప్పాను. కానీ తెలంగాణకు వాళ్లు ఏమీ చేయలేదు” అని చెప్పారు.

మోదీ ప్రధాని కాకుంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4 లక్షలకు చేరేదని అన్నారు. ‘‘చాలా విషయాల్లో మోదీ అడ్డుతగులుతున్నారు. గవర్నర్లే ఎన్నో కీలక బిల్లులను ఆపేస్తున్నారు. అసెంబ్లీలో పాసైన బిల్లులను గవర్నర్లు ఆపడం క్రిమినల్ చర్య. బీజేపీ తమిళనాడు చీఫ్‌‌‌‌గా ఉన్న తమిళిసై ఇప్పుడు రాష్ట్ర గవర్నర్. ఆమె బిల్లులను ఆపుతూ థర్డ్ క్లాస్​ పాలిటిక్స్​ చేస్తున్నారు. చాలా సిల్లీగా వ్యవహరిస్తున్నారు’’ అని ఫైరయ్యారు.

రాష్ట్ర పరిస్థితుల వల్లే సీఎం అయ్యా..

దళితుడిని సీఎం చేస్తానని తాను హామీ ఇచ్చిన మాట వాస్తవమేగానీ..   రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తానే సీఎం కావాల్సి వచ్చిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ‘‘రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో 63 సీట్లే గెలిచాం. ఉద్యమ నాయకుడిగా రాష్ట్రానికి ఏం కావాలో నాకే బాగా తెలుసని, రాష్ట్రాన్ని సమర్థంగా పాలించడం ఇతరులకు సాధ్యం కాదని చాలా మంది నాకు సలహా ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన హామీపై ఇప్పటికీ వెనక్కు తగ్గలేదు. టైం వచ్చినప్పుడు దళితుడిని సీఎం చేస్తాం” అని ప్రకటించారు. తాను ఇప్పుడు దేశం కోసం సేవ చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. అయితే ఢిల్లీకి వెళ్లనని, రాష్ట్రంలో ఉండే కేంద్రంలో చక్రం తిప్పుతానని పేర్కొన్నారు. మహారాష్ట్రలో దాదాపు 25 లక్షల మంది బీఆర్ఎస్‌‌‌‌లో చేరారని, అది చూసి దేశమంతా ఆశ్చర్యపోయిందని పేర్కొన్నారు. ‘‘నా కొడుకు, కూతురు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. వారికి ఊరికే పదవులు రాలేదు. అమెరికాలో చేస్తున్న ఉద్యోగాలను వదులుకుని వచ్చి ఉద్యమాల్లో పాల్గొని జైళ్లకు వెళ్లారు. వారిని ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నారు. అందులో కుటుంబ రాజకీయాల మాట ఎందుకు? కుటుంబ రాజకీయాలు అని అనడం బూటకం’’ అని అన్నారు.

లిక్కర్ స్కామ్.. ఓ కట్టుకథ

లిక్కర్ స్కామ్ కేసు ఓ కట్టుకథ అని కేసీఆర్ అన్నారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మద్యం‌‌ పాలసీని మార్చింది. కానీ కేజ్రీవాల్‌‌ను ఇరికించాలని స్కామ్ అంటూ కేసు పెట్టారు. అందులోకి నా కూతురు కవితనూ లాగి కేసు పెట్టాలనుకున్నారు. ఇదంతా బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన కేసు. అంతే తప్ప అందులో స్కాములేమీ లేవు” అని చెప్పారు.

ఒక సీఎంగా నేను కేంద్రంతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఎన్డీయేలో చేరాలంటూ మోదీ నన్ను రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని నేను షరతు పెట్టాను. ఆ తర్వాతే ఎన్డీయేలో భాగస్వామిని అవుతానని తేల్చిచెప్పాను. కానీ తెలంగాణకు వాళ్లు ఏమీ చేయలేదు.
- సీఎం కేసీఆర్​