బీజేపీ దోస్త్‌ కాదు.. దుష్మన్‌ కాదు

బీజేపీ దోస్త్‌ కాదు..  దుష్మన్‌ కాదు

‘‘బీజేపీ మనకు దోస్త్‌ కాదు.. దుష్మన్‌ కాదు. ఏ పార్టీతో కూడా మనకు శత్రుత్వంగాని, మిత్రత్వంగానీ లేదు. కేంద్ర ప్రభుత్వంతో మనది రాజ్యాంగబద్ధమైన సంబంధమే.. గత ఐదేండ్లలో మనం అంశాల వారీగా మద్దతిచ్చినా కేంద్రం నుంచి పెద్దగా నిధులు రాలే.. రెగ్యులర్‌ గా వచ్చే నిధులతో రాష్ట్రం గట్టెక్కదు. మీరు గట్టిగా ప్రయత్నించి అదనపు నిధులు రాబట్టాలె.. అప్పుడే అనుకున్న మేరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇబ్బందుల్లేకుంట కొనసాగుతాయి..’’ అని టీఆర్​ఎస్​ఎంపీలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సూచించారు. గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు పలు సూచనలు చేశారు. లోక్​సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇతర పార్టీలను చులకనగా చూసే అవకాశముందని, ఇలాంటి తరుణంలో ఓపిగ్గా ఉండాలని చెప్పారు.

మనను నిర్లక్ష్యం చేస్తున్నరు..
గత ఐదేండ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువ నిధులు ఇచ్చారని, తెలంగాణ వంటి రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారని కేసీఆర్​ ఆరోపించారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితే ఎదురుకావొచ్చని, అయినా ప్రయత్న లోపం లేకుండా పనిచేయాలని పార్టీ ఎంపీలకు సూచించారు. కేంద్రంలో బలమైన రాజకీయ శక్తి అధికారంలో ఉండటంతో పొరుగు రాష్ట్రాలతో కలిసి మన హక్కుల సాధన కోసం ప్రయత్నించాలన్నారు. ‘‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం. నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా ‘మిషన్‌ కాకతీయ, భగీరథ’ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిల్లో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు జీఎస్టీ బకాయిలు పెండింగ్‌ ఉండకుండా ఎప్పటికప్పుడు ఫాలో అప్‌ చేయండి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాజెక్టులు, నేషనల్‌ హైవేలు, గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయిస్తే… మనకూ ఇచ్చేలా కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంబంధాన్ని కొనసాగిస్తూనే.. రాష్ట్ర అవసరాలను వివరించాలి. ఎంపీలంతా రెగ్యులర్​గా పార్లమెంట్‌కు వెళ్లాలి. వీలైనంత ఎక్కువగా చర్చల్లో పాల్గొనాలి..” అని ఆదేశించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏయే రంగాల్లో, ఏయే నిధులు వస్తాయో ఎంపీలకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా పనిచేయాలని సూచించారు.

రైల్వే ప్రాజెక్టులపై నజర్ పెట్టండి

జులైలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రైల్వే ప్రాజెక్టులపై ఫాలో అప్‌ చేయాలని ఎంపీలకు కేసీఆర్​ సూచించారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే లైన్​తోపాటు ఇతర రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకుపోవాలన్నారు. కొత్త నేషనల్‌ హైవేలను సాధించేందుకు మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ను సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని పదే పదే కోరాలని, కృష్ణా నీటి పంచాయితీల పరిష్కారానికి ప్రయత్నించాలని.. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై పట్టుబట్టాలని సూచించారు. ఈ భేటీలో ప్రభుత్వ సీఎస్ ఎస్​కే జోషి, ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నర్సింగ్‌రావు కూడా పాల్గొని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు, కేంద్ర పథకాలు, ఇతర అంశాలపై ఎంపీలకు వివరించారు.