ఎలక్షన్ ఉందనే దళిత బంధు పెట్టిన

ఎలక్షన్ ఉందనే దళిత బంధు పెట్టిన

ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం.. గెలవడం జరుగుతూనే ఉంటాయన్నారు సీఎం కేసీఆర్. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరు.. ఇది రాచరిక వ్యవస్థ కాదన్నారు. పాడి కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. కౌశిక్‌ రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పని చేశారన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కౌశిక్‌రెడ్డి పార్టీలో చేరారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సలహాతో ఉద్యమాన్ని నడిపామని.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమం కొనసాగించి చివరకు తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని ఎవరూ అప్పనంగా ఇవ్వలేదన్నారు.


కౌషిక్ ది చాలా చిన్న వయస్సు అన్న కేసీఆర్..ఇంకా చాలా జీవితం వుందన్నారు. అంతేకా చాలా అవకాశాలు వస్తాయన్నారు. కౌశిక్ రెడ్డి భవిష్యత్ కు మంచి మార్గం ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ నిర్మాతలు యువకులేనని చెప్పారు. అంతేకాదు తెలంగాణ ప్రజలు గర్వంగా బతకాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఎవరు ఎంత మొత్తుకున్నా తెలంగాణలో ఇకపై కరెంట్‌ పోదన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నట్లు తెలిపారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ అయిందన్నారు. గొర్రెల పంపిణీ అంటే పప్పు, బెల్లం లాంటి పథకం కాదన్నారు. తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు లేవని..పథకాలు ఏవి ఎలక్షన్ ల కోసం పెట్టినవి కాదన్నారు. ధరణి, కేసీఆర్ స్కీం లాంటివి ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న అంద్రవాళ్లకు చెప్పిన.. 40 యేండ్ల క్రితం వచ్చిండ్రు.. నేను హైదరాబాదీ అని చెప్పుకోండి అని చెప్పిన అన్నారు.

బ్రోకర్ గాల్లు అడ్డం పొడుగు మాట్లాడితే ఎట్లా.. హరితహరం చెట్ల కింద నేను ఒక్కన్నే కూర్చుంటానా అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ లో మంచి జరగడం ప్రారంభమైంది.. అందుకే అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తోందన్నారు. కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకు దళితులు పేదలు గానే వున్నారన్నారు.

హుజూరాబాద్ అదృష్టం కాబట్టి దళిత బంధుకు ఈ నియోజక వర్గాన్ని పైలెట్ తీసుకున్నామని తెలిపారు సీఎం. దళిత బంధు ఇచ్చిన వారికి పత్యేక కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటికి పది లక్షలు ఇస్తామని..వాటికి వాళ్ళు ఓనర్ అవుతారన్నారు. ఆ 10 లక్షలు ఏమి చేస్తున్నారన్నది పర్యవేక్షణ వుంటుందన్నారు. ప్రతి జిల్లాకు రక్షణ నిధి పెద్దమొత్తంలో ఏర్పాటు చేస్తామన్నారు. జన్మకు కూడా దళితులు మళ్ళీ కిందికి రావొద్దు.. పేదలు కావద్దన్నారు.

ఎన్నికలు,రాజకీయాలు వస్తుంటాయి..పోతుంటాయి..ఇది చిల్లర వ్యవహారం అన్న సీఎం..రాజకీయ పార్టీ ఏ పెద్ద పవర్ అన్నారు. అధికారం వుండటమే గొప్ప కాదు..కొందరు అత్యాశ పడుతారని.. అది కరెక్ట్ కాదన్నారు. ఎలక్షన్ వుంది కాబట్టి హుజురాబాద్ లో దళిత బంధు పెట్టామంటున్నారు.. అవును పెడతాం..నేను స్వార్ధపరుడినైతే గజ్వేల్ లోనే  ఈ స్కీంను పెట్టుకునే వాడిని కదా అని అన్నారు. పథకం పెట్టినప్పుడు లబ్ధి కోరుకోకూడదా.. ఏమి పెట్టని మీరు లబ్ధి కొరుకోవచ్చా.. కానీ మేము కోరుకోవద్దా అని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పెట్టిన ముష్టి 50 వేల ఆపద్భాందు పథకానికే డబ్బా కొట్టుకున్నారు అని అన్నారు. చివరగా కౌశిక్ కు మంచి భవిష్యత్ ఉందన్న కేసీఆర్.. అది హుజురాబాద్ కు మాత్రమే పరిమితం కాదని.రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందన్నారు.