ఎమ్మెల్యేలను కొనబోయినోడు.. నాపై పోటీ చేస్తడట : సీఎం కేసీఆర్

ఎమ్మెల్యేలను కొనబోయినోడు.. నాపై పోటీ చేస్తడట : సీఎం కేసీఆర్
  • కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్
  • రాజకీయ అస్థిరత తేవాలని చూసినోళ్లను ఓడించాలె
  • నవోదయ స్కూల్, మెడికల్​ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఓటేయొద్దు
  • మూడోసారి గెలిపిస్తే బీడీ కార్మికులందరికీ పెన్షన్  
  • ఎన్నికల్లో లీడర్లు కాదు.. ప్రజలే గెలవాలని కామెంట్స్

కామారెడ్డి, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో తనని ముప్పు తిప్పలు పెట్టినట్టే.. రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలను కొని రాజకీయ అస్థిరత సృష్టించాలని కొందరు చూశారని సీఎం కేసీఆర్​ఆరోపించారు. అలాంటి వారిని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం మధ్యాహ్నం కేసీఆర్ ​నామినేషన్​ వేశారు. అనంతరం స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో జరిగిన సభలో మాట్లాడారు. ‘బీఆర్ఎస్​ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించి రూ.50 లక్షలతో పట్టుబడ్డ నాయకుడే కామారెడ్డిలో నాపై పోటీ చేస్తున్నడంట’ అంటూ రేవంత్​ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు. అలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలో కామారెడ్డి ప్రజలే నిర్ణయించాలన్నారు. ఆలోచించి విచక్షణతో ఓటు వేయాలని, ఎవరి ప్రవర్తన ఏమిటో చూడాలన్నారు. గ్రామాల్లో చర్చ పెట్టి.. ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకోవాలన్నారు. మూడోసారి గెలిచి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని బీడీ కార్మికులందరికీ పింఛన్​ అందజేస్తామని కేసీఆర్ ​హామీ ఇచ్చారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని, ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా పింఛన్​ఇస్తలేరన్నారు.  

కాంగ్రెస్ వల్లే సమస్యలు  

కాంగ్రెస్​పార్టీ 50 ఏండ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినా చేసిందేమీ లేదని కేసీఆర్​ విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు కరెంట్ లేదు, మంచినీళ్లు లేవు, సాగు నీళ్లు లేవు, వలసబోవుడు, చేనేత కార్మికులు చచ్చిపోవుడు, రైతుల ఆత్మహత్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. వీటన్నింటిని మన నెత్తిన పెట్టింది కాంగ్రెస్​కాదా? అని ప్రశ్నించారు. తరతరాలుగా దళితులు అణచివేతకు గురువుతూనే ఉన్నారన్నారు. నెహ్రూ హయాంలోనే దళితబంధు పెట్టి ఉంటే దళితులు ఇంత దౌర్భాగ్యంలో ఉండేవాళ్లు కాదన్నారు. రైతు బంధు వద్దు, కరెంటు వద్దు, ధరణి తీసేస్తం అనేటోళ్లు కావాల్నా? రైతులను కడుపులో పెట్టుకొని కాపాడేటోళ్లు కావాల్నా?  రైతులు ఆలోచించాలని కేసీఆర్ అన్నారు.  

బీజేపీకి ఎందుకు ఓటేయాలి?

తెలంగాణపై పగబట్టి ఒక్క నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ ఇవ్వని కేంద్రంలోని బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలని కేసీఆర్​ ప్రశ్నించారు. బోర్లకు మీటర్లు పెట్టలేదని ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున రూ.25 వేల కోట్లు స్టేట్​కు మోదీ కట్ ​చేశారన్నారు. ఇయ్యాల ఏం ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్లు కామారెడ్డిలో ఓట్లు అడుగుతున్నారు అని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు పెట్టాలని100 ఉత్తరాలు రాసినా, ఎంపీలు కొట్లాడినా ఇవ్వలేదన్నారు.  

కేసీఆర్ ​వెంట చానా వస్తయ్

‘కేసీఆర్​వస్తే ఒక్కడే రాడు కదా.. వెంబడి చానా వస్తయ్. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు యాడాదిన్నర, రెండేండ్లలో సాగు నీళ్లు వచ్చి పారుతయ్. గ్యారంటీగా పెండింగ్​లో ఉన్న  కాళేశ్వరం పని ఆగమేఘాల మీద కంప్లీట్​ చేసి సాగు నీళ్లు తెచ్చి చూపిస్తా. విద్యా సంస్థలు, పరిశ్రమలు వస్తయి. కామారెడ్డి టౌన్​తో పాటు, పల్లె ల రూపు రేఖలు మారుతాయి’ అని కేసీఆర్ అన్నారు. కామారెడ్డి గడ్డతో తనకు పుట్టుకతోనే సంబంధముందని కేసీఆర్ చెప్పారు. బీబీపేట మండలం కోనాపూర్ (పొశానిపల్లి)లోనే తన తల్లి పుట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జల సాధన ఉద్యమం చేశామని, అప్పుడు కామారెడ్డి మండల బ్రిగేడియర్​గా తానే పని చేశానన్నారు. అంతకుముందు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ఇంట్లో పార్టీ నేతలతో కేసీఆర్​ సమావేశమయ్యారు. పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. బహిరంగ సభలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి, మంత్రి ప్రశాంత్​ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.