
- వస్తున్నట్టు ముందు సమాచారం
- కేసీఆర్ కోసం వెయిట్ చేసిన గవర్నర్
- రావట్లేదని సీఎం సమాచారం ఇవ్వలేదన్న తమిళిసై
- హాజరైన పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు
- ప్రభుత్వం నుంచి సీఎస్ హాజరు
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ పోలేదు. ఈ కార్యక్రమానికి సీఎం హాజరవుతారని ముందుగా సీఎంవో నుంచి రాజ్‌భవన్ సెక్రటేరియెట్‌కు సమాచారం ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5.30 గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, సీఎం 7 గంటలకు వస్తారని ప్రగతి భవన్ నుంచి రాజ్‌భవన్‌కు సమాచారం ఇచ్చారు. గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఇన్‌చార్జీ బాధ్యతల్లో ఉండటంతో అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకే హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేరుగా రాజ్‌భవన్ కు వచ్చిన ఆమె సీఎం కేసీఆర్ కోసం వెయిట్ చేశారు. రాత్రి 7.25 గంటలకు సీఎం ఎట్ హోంకు రావట్లేదని సీఎస్ సోమేశ్ కుమార్ గవర్నర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై మీడియాతో చిట్‌చాట్ చేశారు. సాయంత్రం 7 గంటలకు వస్తానని సీఎం సమాచారం ఇచ్చారని, ఆయన ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు. ఎట్ హోంకు రావట్లేదని సీఎం ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఎట్‌హోంకు సీఎం, సీజే, మంత్రులు, స్వాతంత్య్ర సమరయోధులు, పద్మ అవార్డు గ్రహీతలు సహా పలువురు ప్రముఖులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపానని తెలిపారు.
మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మా
సీఎం కేసీఆర్ ఎట్ హోంకు వస్తారని సీఎంవో నుంచి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సిటీలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఈ కార్యక్రామానికి హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. సీఎంతో పాటే రాజ్‌భవన్‌కు మంత్రులు, ఇతర నేతలు వెళ్లాలని అనుకున్నా, సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో వారు కూడా ఎట్‌హోంకు డుమ్మా కొట్టారు. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఎల్.రమణ ఒక్కరే రాజ్‌భవన్‌కు వచ్చారు. ఎట్ హోంకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని, ఉన్నట్టుండి ఎందుకు రద్దు చేసుకున్నారో తెలియదని టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. మరోవైపు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మాజీ గవర్నర్లు విద్యాసాగర్ రావు, పీఎస్ రామ్మెహన్ రావు, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘనందన్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగిలయ్య తదితరులు ఎట్‌హోంకు హాజరయ్యారు.
కరోనా వచ్చిందేమో
‘‘సీఎంకు కరోనా వచ్చిందేమో.. అందుకే రాలేదేమో” అని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు. ఎట్ హోమ్ లో ఆయన మీడియాతో చిట్ చేశారు. ఇగ ప్రెస్ నోట్ వస్తదని, 15 రోజులు రెస్ట్ అంటారని ఎద్దేవా చేశారు. కరోనా వస్తే కలెక్టరేట్ల ఓపెనింగ్, మునుగోడు ప్రచారానికి వెళ్లే అవకాశం ఉండదని తెలిపారు. చీకోటి ప్రవీణ్ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఉన్నారని, త్వరలో అన్ని పేర్లు బయటకు వస్తాయని తెలిపారు.
అవార్డుల పంపిణీ
వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో 75 మంది విన్నర్లకు తమిళిసై అవార్డులు అందజేశారు. కరోనా స్టార్టింగ్ సమయంలో పీపీఈ కిట్లు, మందులు దిగుమతి చేసుకున్నామని, తరువాతి కాలంలో విదేశాలకు ఎగుమతి చేసేలా డెవలప్ అయ్యామని తమిళిసై గుర్తు చేశారు. తక్కువ టైమ్ లో దేశమంతా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపారు.