ఏడాదిగా మండలికి రాని సీఎం

ఏడాదిగా మండలికి రాని సీఎం
  • ఆదివారం సారొస్తారని ఎమ్మెల్సీల హడావుడి
  • రాకపోవడంతో టీఆర్ఎస్ సభ్యుల గుస్సా 

హైద్రాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ శాసన మండలికి వస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆదివారం ఉదయం నుంచి చాలా హుషారుగా కనిపించారు. సార్ ఎప్పుడొస్తారని అసెంబ్లీకి వచ్చి మరీ ఆరా తీశారు. కొత్తగా మండలి చీఫ్ విప్ బాధ్యతలు తీసుకున్న బోడకుంటి వెంకటేశ్వర్లు అసెంబ్లీలోని సీఎం చాంబర్ ముందు చక్కర్లు కొడుతూ కనిపించారు. కానీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు అమోదం పొందగానే సీఎం బయటికి వచ్చి కారులో కూర్చున్నారు. కాన్వాయి పెద్దల సభవైపు కాకుండా ప్రగతిభవన్ కు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీలు పెదవి విరిచారు. సార్ కు ఎందుకో పెద్దల సభలో అడుగు పెట్టేందుకు ఇష్టం లేదని వారిలో వారు చర్చించుకున్నారు. సీఎం కేసీఆర్ మండలికి రాకపోవడంతో ఆర్థిక మంత్రి హరీష్ రావు ద్రవ్య వినిమయ బిల్లుకు సమాధానం ఇచ్చారు.

మండలిలో అడుగుపెట్టక ఏడాది

రాష్ట్ర విభజన కొత్తలో కేసీఆర్ శాసన మండలిలోకి  రెగ్యులర్ గా వచ్చి అక్కడ జరిగే చర్చలో పాల్గొనేవారు. పెద్దల సభలో చర్చలు చాలా అర్థవంతంగా జరుగుతాయని కితాబు కూడా ఇచ్చారు. అసెంబ్లీ రద్దుకు ముందు నుంచి మండలికి రావడం తగ్గించారు. అసెంబ్లీని 2018 సెప్టెంబరు 9న రద్దు చేశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు మండలి ప్రతి ఆరు నెలలకొసారి సమావేశం కావాలి. ఆ కారణంగా అసెంబ్లీ రద్దు జరిగిన తరువాత పెద్దల సభ సెప్టెంబరు 27న విడిగా సమావేశమైంది. ఆ సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని వాజ్ పేయి, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, పార్లమెంట్ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీలకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత ఆయన మళ్లీ మండలికి రాలేదు.

సంఖ్యాబలం ఉందని నిర్లక్ష్యమా?: జీవన్ రెడ్డి

పెద్దల సభ అంటే సీఎం కేసీఆర్ కు నిర్లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సంఖ్యాబలం ఉందనే కారణంతో సభకు రాకపోవడం మంచి సాంప్రదాయం కాదన్నారు. అసెంబ్లీ హడావుడీగా ఆమోదించే బిల్లులను పెద్దల సభలో ఉండే అనుభవజ్జులు, మేధావులు సరిదిద్దే అవకాశం ఉందన్నారు.

చైర్మన్ ఎన్నికప్పుడూ రాలే

మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నెల11న ఎన్నికయ్యారు. ఆ రోజు సీఎం మండలికి వస్తారని అందరూ అనుకున్నారు. సీఎం సెక్యూరిటీ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ చివరి నిమిషంలో సీఎం రావడం లేదని సమాచారం వచ్చింది.

CM KCR did not come to the Legislative Council for a year