హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి, మెస్సీ అపర్ణ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచులో మ్యాచ్ 18వ నిమిషంలో గ్రౌండ్లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే గోల్ కొట్టి అలరించారు. యువకులతో పోటీ పడి మరీ సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టడంతో అభిమానుల కేరింతలతో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది.
అనంతరం గ్రౌండ్లోకి దిగిన మెస్సీ కాసేపు సీఎం రేవంత్ తో సరదాగా మ్యాచ్ ఆడారు. అనంతరం ఇరుజట్లు పెనాల్టీ షూటౌట్లో పాల్గొన్నాయి. షూటౌట్లో సీఎం రేవంత్ గోల్ కొట్టడంతో మెస్సీ చప్పట్లు కొట్టి అభినందించారు. మ్యాచ్ అనంతరం ప్లేయర్స్‌తో కలిసి మెస్సీ ఫొటో దిగారు. బాల్స్‌ను స్టేడియం స్టాండ్స్‌లోకి కిక్ చేసి అలరించారు మెస్సీ. తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి స్టేడియంలో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు.
కాగా, గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) మెస్సీ హైదరాబాద్‌కు వచ్చారు. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ భారీ బందోబస్తు నడుమ అక్కడి నుంచి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. ఫలక్ నుమా ప్యాలెస్‌లో మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ఆ తర్వాత గోట్ ఇండియా టూర్లో భాగంగా ఫలక్ నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మీట్ అండ్ గ్రీట్‌లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఈ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వచ్చారు.

