- ట్రంప్ విధించిన పన్నులు అక్రమం
- వాటితో అమెరికన్లకే నష్టమని వెల్లడి
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% అదనపు టారిఫ్‌లను ఆ దేశ చట్ట సభ సభ్యులు వ్యతిరేకించారు. ఆ టారిఫ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు డెమోక్రాట్స్ అమెరికా ప్రతినిధుల సభలో శుక్రవారం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి తీసుకొచ్చారు.
‘‘భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు అక్రమం. అమెరికాకు ఇండియా ముఖ్యమైన భాగస్వామి. అదనపు టారిఫ్‌లతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అమెరికా ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి” అని అందులో పేర్కొన్నారు. భారత్‌పై విధించిన టారిఫ్‌లను రద్దు చేయాలని, అందుకు చర్యలు తీసుకోవాలని సభను కోరారు. అలాగే బ్రెజిల్‌పై విధించిన అదనపు పన్నులను కూడా తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ దేశాల నుంచి వస్తున్న దిగుమతులపై టారిఫ్‌లు విధించకుండా ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ పవర్స్ ను కట్టడి చేయాలని విన్నవించారు.
టారిఫ్‌లతో అమెరికాకే నష్టం..
భారత్‌తో నార్త్ కరోలినా ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉన్నదని ఆ రాష్ట్ర ప్రతినిధి డెబోరా రాస్ పేర్కొన్నారు. ‘‘వాణిజ్యం, పెట్టుబడులు, ఇండియన్–అమెరికన్ కమ్యూనిటీ కారణంగా ఇండియాతో నార్త్ కరోలినాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇండియన్ కంపెనీలు బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించాయి. అలాగే నార్త్ కరోలినా వ్యాపారులు ప్రతిఏటా మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఇండియాకు ఎగుమతి చేస్తున్నారు” అని ఆమె తెలిపారు.
‘‘ఇప్పటికే అధిక ధరలతో టెక్సాస్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇండియాపై టారిఫ్‌ల కారణంగా ధరలు మరింత పెరిగి జనం సతమతమవుతున్నారు. ఈ అక్రమ టారిఫ్‌లతో టెక్సాస్ ప్రజలపై ప్రతిరోజూ పన్నులు పడుతున్నాయి” అని మార్క్ వీసీ చెప్పారు. ‘‘ఇండియాపై టారిఫ్‌లతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అమెరికా ప్రజలపై భారం పడుతున్నది. సప్లై చైన్‌పై తీవ్ర ప్రభావం ఉంటున్నది. ఈ టారిఫ్‌లను రద్దు చేస్తే రెండు దేశాల మధ్య బంధం బలోపేతం అవుతుంది” అని రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు.
