కోల్కతాలో రచ్చరచ్చ.. మెస్సీ ఇలా వచ్చి.. అలా వెళ్లడంతో ప్రేక్షకుల ఆగ్రహం

కోల్కతాలో రచ్చరచ్చ.. మెస్సీ ఇలా వచ్చి.. అలా వెళ్లడంతో ప్రేక్షకుల ఆగ్రహం
  • స్టేడియంలోకి బాటిళ్లు, చైర్లు విసిరేసిన ఫ్యాన్స్ 
  • టెంట్లు చించేసి నిరసన..తీవ్ర ఉద్రిక్తత, లాఠీచార్జి
  • ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్

కోల్ కతా: ప్రపంచ ఫుట్ బాల్ లెజెండ్, అర్జెంటినా స్టార్ లియోనల్  మెస్సీ కోల్ కతా ఫుట్ బాల్ మ్యాచ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ‘గోట్  టూర్  ఆఫ్ ఇండియా’ లో భాగంగా మెస్సీ శనివారం కోల్ కతా చేరుకున్నారు. సాల్ట్ లేక్  లోని వివేకానంద స్టేడియంలో ఆయన మ్యాచ్  ఆడాల్సి ఉండగా.. టన్నెల్  నుంచి స్టేడియంలోకి మెస్సీ ప్రవేశించగానే పరిస్థితి  అదుపు తప్పింది. స్టేడియంలోకి మెస్సీ రాగానే ఆయనను చూసేందుకు వారందరూ ఎగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపుతప్పేలా ఉందని భావించిన ఈవెంట్  నిర్వాహకులు వెంటనే మెస్సీని స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు. అప్పుడు కూడా మెస్సీ చుట్టూ పోలీసులు, భద్రతా సిబ్బంది ఉండడంతో స్టేడియంలో ఫ్యాన్స్  ఆయనను సరిగ్గా చూడలేకపోయారు. మెస్సీ ఇలా వచ్చి,  అలా వెళ్లిపోవడంతో ఫ్యాన్స్  ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

స్టేడియంలోకి వాటర్  బాటిల్స్, చైర్లు విసిరేశారు. అంతేకాకుండా స్టేడియంలోకి చొరబడి అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను చించివేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పోలీసులు.. ప్రేక్షకులపై లాఠీచార్జి చేశారు. కాగా.. మెస్సీ మ్యాచ్ చూసేందుకు నిర్వాహకులు రూ.5 వేల నుంచి రూ.25 వేలు వసూలు చేశారు. అంత పెట్టి టికెట్లు కొన్నా మెస్సీ ముఖం కూడా చూడలేపోయామని ఫ్యాన్స్, ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయినందుకు ఈవెంట్  ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. గందరగోళానికి ఆయనే  కారణమని పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

గందరగోళం ఇలా షురూ అయింది
సహచరులు లూయీ సువారెజ్, రోడ్రిగో డీపాల్ తో కలిసి ఉదయం 11.15 గంటలకు మెస్సీ.. స్టేడియానికి చేరుకున్నారు. మెస్సీ వాహనాన్ని స్టేడియంలోని టచ్ లైన్  వద్ద పార్క్  చేశారు. స్టేడియంలోకి మెస్సీ ప్రవేశించగానే వీఐపీలు, నిర్వాహకులు, సెలబ్రిటీలు, పోలీసులు అందరూ ఆయనను చుట్టుముట్టేశారు. ఆయన అలాగే పిచ్ పై కాస్త దూరం నడిచారు. ‘మెస్సీ, మెస్సీ’ అంటూ అరుస్తున్న ప్రేక్షకుల వైపు అభివాదం చేశారు. అప్పటికి కూడా మెస్సీ చుట్టూ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. దీంతో మెస్సీ కనబడడం లేదని, భారీ స్ర్కీన్లు కూడా క్లియర్  ఇమేజ్ ను చూపించడం లేదని ఫ్యాన్స్  ఫిర్యాదు చేశారు. 

దీనికి తోడు గ్రౌండ్ లో మెస్సీ ల్యాప్  (స్టేడియంలో చుట్టూ తిరిగి ప్రేక్షకులను పలకరించడం) చేయరని నిర్వాహకులు ప్రకటించారు. ఈ టైంలోనే ఆయన వెనక్కి వెళ్లారు. షెడ్యూల్  కన్నా ముందే మెస్సీని స్టాఫ్  తీసుకెళ్లారు. దీంతో ప్రేక్షకుల్లో కోపం కట్టలు తెంచుకుంది. కాగా.. టీం ఇండియా మాజీ కెప్టెన్  సౌరవ్  గంగూలీ, సీఎం మమతా బెనర్జీతో కలిసి బాలీవుడ్  నటుడు షారుఖ్  ఖాన్  మెస్సీ మ్యాచ్ చూడాల్సి ఉంది. ఈ మ్యాచ్  కోసం షారుఖ్  ముందుగానే కోల్ కతాకు చేరుకున్నారు. అయితే, స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వారు మ్యాచ్  చూడలేకపోయారు. 

మెస్సీకి, ఫ్యాన్స్ కు మమత సారీ.. ఘటనపై విచారణకు ఆదేశం
మెస్సీ మ్యాచ్ లో గందరగోళంపై సీఎం మమతా బెనర్జీ విచారణకు ఆదేశించారు. గ్రౌండ్ లో జరిగిన ఘటనతో తాను తీవ్రంగా నిరాశ చెందానని సీఎం తెలిపారు. మెస్సీతో పాటు ఆయన ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పారు. ‘‘మెస్సీని చూసేందుకు ఫ్యాన్స్  ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. 

కనీసం ఆయన ముఖం కూడా చూడలేకపోయారు. ఐయామ్  వెరీ సారీ. ఘటనపై విచారణకు రిటైర్డ్  జస్టిస్  ఆశిమ్  కుమార్ రే నేతృత్వంలో ఎంక్వయిరీ కమిటీని నియమిస్తున్నా” అని మమత ట్వీట్  చేశారు. మరోవైపు ఈవెంట్ ను సరిగా నిర్వహించలేదని మమత ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఘటనకు బాధ్యత వహించి సీఎం వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్  చేశారు.