హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్లో ఎరువుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో యూరియా వినియోగం బాగా ఉండే అవకాశం ఉన్నందున బఫర్ నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆఫీసర్లను ఆదేశించారు. కేంద్రం కేటాయించిన ఎరువులలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెలకు 2 లక్షల టన్నుల యూరియాను అందించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉందన్నారు. కేంద్రం డిసెంబర్ నెలకు రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో 86 వేల టన్నులు ఇప్పటికే పోర్టులకు చేరాయన్నారు. వాటిని రాష్ట్రానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే, పోర్టుల మంత్రులకు తుమ్మల లెటర్ రాశారు.
