నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కి తొలిరోజు మిక్సెడ్ టాక్ అందుకుంది. ఈ క్రమంలో అఖండ 2 బాక్సాఫీస్ వద్ద మేకర్స్ ఆశించినంత కలెక్షన్స్ సాధించలేకపోయింది. అయితే, తొలిరోజు (డిసెంబర్ 12న) భారీ అంచనాలతో రావడం వల్ల, ఇది బాలకృష్ణ కెరీర్లో అతిపెద్ద ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది. అయినప్పటికీ.. పెద్ద వసూళ్లు అని చెప్పలేం.
ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ అప్‌డేట్ ప్రకారం, అఖండ 2 ఇండియాలో రూ.22.53 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా రూ.21.95 కోట్లు వసూళ్ళు చేయగా, హిందీలో రూ.11 లక్షలు, తమిళంలో రూ.43 లక్షలు, కర్ణాటకలో రూ.3 లక్షలు, మలయాళంలో ఒక లక్ష రూపాయలు వసూళ్లు చేసింది. డిసెంబర్ 11న వేసిన ప్రీమియర్స్ ద్వారా రూ.8 కోట్లు వచ్చాయని సినీ వర్గాలు వెల్లడించాయి.
ఇలా ప్రీమియర్+తొలిరోజు వసూళ్లు కలుపుకుని అఖండ 2 మొత్తం ఇండియా వైడ్గా రూ.30 కోట్లు దక్కించుకుంది. 2021లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన అఖండ 1, ఇండియాలో 21కోట్ల నెట్ సాధించింది. ఇపుడు భారీ అంచనాలతో వచ్చిన అఖండ 2 మాత్రం ఇండియాలో 22కోట్లు మాత్రమే సాధించడం గమనార్హం!! ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్ళు ఎంత వచ్చాయనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అఖండ 2: తాండవం శుక్రవారం, డిసెంబర్ 12, 2025న మొత్తం మీద 56.93% తెలుగు ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. తెలుగు మార్కెట్లో, ఉదయం మరియు మధ్యాహ్నం షోలలో ఆక్యుపెన్సీ 47.24% మరియు 46.18% వరకు ఉంది, తరువాత సాయంత్రం షోలలో 60% మరియు రాత్రి షోలలో 74.30% వరకు షూట్ అయింది. హిందీ బెల్ట్‌లో చూసుకుంటే మొత్తం 10.16% ఆక్యుపెన్సీకలిగి ఉంది. 3D వెర్షన్ 11.24%తో కొంచెం మెరుగ్గా ఉంది.
మిక్సెడ్ టాక్:
బాలయ్య ఫ్యాన్స్ మినహా, మిగతా సినీ ఆడియన్స్ నుంచి మిక్సెడ్ రివ్యూస్ వచ్చాయి. బాలయ్య అద్భుతమైన నటన, ఎలివేషన్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్, క్లైమాక్స్ "బ్లాక్‌బస్టర్" అని టాక్ వచ్చింది, ఇక మిగతా పోర్షన్స్ లో మాత్రం కొన్ని క్లాసులు పీకేలా ఉందని టాక్ వచ్చింది. ఈ క్రమంలో ఓవర్ డోస్ డైలాగ్స్, దిశానిర్దేశం లేని స్క్రీన్‌ప్లే, పేలవమైన VFX మరియు జీరో లాజిక్‌లను చేర్చారని విమర్శించారు. అంతేకాకుండా 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ పార్ట్ కి సరిపోల్చలేమని టాక్ వచ్చింది. ఏదేమైనా వీకెండ్ లో వచ్చే ఓవరాల్ టాక్ ని బట్టి సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

