V6 News

భర్త చేతిలో దేవుడి ఫొటో.. భార్య చేతిలో పురుగుల మందు.. ఇంటింటికీ వెళ్లి ఇచ్చిన డబ్బులు అడుగుతున్న.. ఓడిన సర్పంచ్ అభ్యర్థి !

భర్త చేతిలో దేవుడి ఫొటో.. భార్య చేతిలో పురుగుల మందు.. ఇంటింటికీ వెళ్లి ఇచ్చిన డబ్బులు అడుగుతున్న.. ఓడిన సర్పంచ్ అభ్యర్థి !

నల్లగొండ జిల్లా: నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన జరిగింది. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో BRS పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోవడంతో దేవుని ఫోటోతో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్ధించడంతో స్థానికంగా ఈ విషయం హాట్ టాపిక్ అయింది. BRS బలపరిచిన అభ్యర్ధిపై 448 ఓట్లతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి జక్కిలి పరమేష్ గెలిచాడు. ఈ గ్రామంలో 15 వందల 77 ఓట్ల ఉండగా 14 వందల 94 ఓట్లు పోలవడం గమనార్హం.

మహబూబాబాద్‌ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీ నాయక్‌ సొంత ఊరైన సోమ్లాతండాలో ఆయన వదిన భూక్య కౌసల్య కాంగ్రెస్‌ తరఫున సర్పంచ్‌ బరిలో నిలువగా.. అదే తండాకు చెందిన ఇస్లావత్‌ సుజాత కాంగ్రెస్‌‌‌రెబల్‌గా పోటీ చేసింది. గురువారం జరిగిన ఎన్నికల్లో సుజాత 17 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దీంతో ఓడిపోయిన క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ భుక్యా కౌసల్య, ఆమె భర్త ధల్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌, కొడుకు సందీప్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం సేవాలాల్‌‌‌‌‌‌‌‌ జెండాతో తండాలో ఇంటింటికీ తిరుగుతూ... ఎన్నికలకు ముందు రోజు తాను ఓటుకు రూ. 1500, ఇంటికి ఓ కోడి పంచానని చెప్పారు. అయినా తనకు ఓటు వేయకపోవడం వల్లే ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ప్రతి ఓటరును కలుస్తూ ‘మీరు నాకు ఓటు వేసినట్లు కులదైవమైన సేవాలాల్‌‌‌‌‌‌‌‌ జెండా పట్టుకొని ప్రమాణం చేయండి.. లేదంటే నేను పంచిన డబ్బులు నాకు ఇచ్చేయండి’ అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ‘పోటీ చేయొద్దని మేం ముందే చెప్పాం.. అయినా మీరు వినకుండా పోటీచేసి ఓడిపోయారు.. మేం డబ్బులు, కోడి ఇవ్వమని అడగ లేదు.. మాకు ఎందుకు ఇచ్చారు’ అంటూ తండావాసులు సమాధానం ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య లొల్లి మొదలైంది. గొడవ పెద్దగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.