సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో భార్యాభర్తలిద్దరూ కౌన్సిలర్లుగా గెలిచారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కొనతం మంజుల 4వ వార్డు నుంచి బరిలో నిలిచి కౌన్సిలర్ గా గెలుపొందగా భర్త కొనతం చిన వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 15వ వార్డు అభ్యర్థిగా నిలిచి కౌన్సిలర్ గా గెలుపొందాడు. దీంతో ఒకే పార్టీ, ఒకే ఇంటి నుంచి భార్యాభర్తలు ఇద్దరూ గెలవడంతో నేరేడుచర్ల మున్సిపాలిటీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తిరుమలగిరి మున్సిపాలిటీలో తల్లి కొడుకు కౌన్సిలర్లుగా విజయం సాదించారు. బీఆర్ఎస్ తరఫున నాలుగో వార్డ్ కౌన్సిలర్ గా బత్తుల శకుంతల విజయం సాధించగా ఏడవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె కుమారుడు బత్తుల శీను విజయం సాధించారు.
పోల్ చిట్టిలో వినతులు
తమ సమస్యలను తీర్చాలంటూ పోల్ చిట్టిలలో లేఖలు ప్రత్యక్షమయ్యాయి. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా మా రిటర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ అంటూ 47వార్డులోని బ్యాలెట్ బాక్సులో లెటర్ ప్రత్యక్షమైంది. తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని లెటర్ రాసి బ్యాలెట్ బాక్సులో పెన్షనర్ ఓటుతో పాటు లెటర్ వేశారు. ఇక 48వ వార్డులో రోడ్డు వెడల్పుతో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని పోల్ చిట్టితో పాటు లెటర్ బ్యాలెట్ బాక్సులో వేశారు.
