'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ శనివారం (డిసెంబర్ 13) హైదరాబాద్‌కి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన మెస్సీకి అభిమానులు, అధికారులు అపూర్వ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్న మెస్సీ, అగ్రశ్రేణి అతిథులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
మెస్సీ మీట్ అండ్ గ్రీట్
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో మెస్సీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని మెస్సీతో ముచ్చటించారు. ఇటువంటి చారిత్రక రాజప్రాసాదంలో ప్రపంచ క్రీడా దిగ్గజం అడుగుపెట్టడంతో నగరంలో సరికొత్త సందడి నెలకొంది.
ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ ఫుట్‌బాల్..
ప్యాలెస్ కార్యక్రమం అనంతరం, మెస్సీ నేరుగా ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన హై-వోల్టేజ్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఆయన పాల్గొన్నారు. మెస్సీని చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా, 'జెర్సీ నంబర్ 10' ధరించిన అభిమానులు ఉప్పల్ స్టేడియాన్ని నీలి-తెలుపు రంగుల సంద్రంగా మార్చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొని ఆటగాళ్లను, అభిమానులను ఉత్సాహపరచనున్నారు.
ఆకర్షణగా అల్లు అయాన్, అర్హ
మెస్సీ మ్యాచ్ సందర్బంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారసులు.. కుమారుడు అల్లు అయాన్ , కుమార్తె అల్లు అర్హ ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ స్నేహితులతో కలిసి వచ్చిన ఈ అన్నాచెల్లెళ్లు అక్కడి వాతావరణాన్ని ఉల్లాసంగా మార్చేశారు. కెమెరాల కంట పడినప్పుడు, అయాన్ అక్కడున్న వారందరికీ ఉత్సాహంగా 'హాయ్' చెప్పారు. సరదాగా, తన చెల్లి అర్హ ముఖం కెమెరాకు కనిపించకుండా అయాన్ చెయ్యి అడ్డం పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేడియంలో ఉన్న వారితో ఈ అన్నాచెల్లెళ్లు కాసేపు సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
భద్రత కట్టుదిట్టం.. పోలీసుల హైఅలర్ట్
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ కార్యక్రమం సందర్భంగా జరిగిన గందరగోళ పరిస్థితుల దృష్ట్యా, హైదరాబాద్ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేవలం పాసులు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించారు. మ్యాచ్ దృష్ట్యా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మెస్సీ పర్యటన హైదరాబాద్‌లో క్రీడా , సామాజిక అంశాలలో ఒక మరపురాని రోజుగా నిలిచింది.

