ఓటేసేందుకు వెళ్తూ ఆరుగురు మృతి.. మెదక్లో బైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

ఓటేసేందుకు వెళ్తూ ఆరుగురు మృతి.. మెదక్లో బైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
  • జనగామలో మరో ప్రమాదం.. అన్నదమ్ములు మృతి

మెదక్‌‌/శంకరంపేట/వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్తూ ఆరుగురు చనిపోయారు. మెదక్‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు, జనగామలో జరిగిన యాక్సిడెంట్‌‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన లింగమయ్య (45), ఆయన భార్య సాయమ్మ (40), కొడుకు సాయి (18), కూతురు మానస (9) హైదరాబాద్‌‌లోని లింగంపల్లిలో ఉంటున్నారు. 

ఆదివారం గ్రామంలో పంచాయతీ ఎన్నిక జరగనుండడంతో ఓటు వేసేందుకు శనివారం రాత్రి బైక్‌‌పై సొంతూరుకు బయలుదేరారు. నేషనల్‌‌ హైవే 161పై వెళ్తుండగా మెదక్‌‌ జిల్లా పెద్ద శంకరంపేట సమీపంలో వీరి బైక్‌‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో లింగమయ్య, సాయమ్మ, సాయి, మానస అక్కడికక్కడే చనిపోయారు. పెద్ద శంకరంపేట పోలీసులు స్పాట్‌‌కు చేరుకుని డెడ్‌‌బాడీలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జనగామలో.. 
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌‌‌‌కు చెందిన బుర్ర కల్యాణ్(27), బుర్ర నవీన్(27) అన్నదమ్ములు. కల్యాణ్ నారాయణ స్కూల్​ఇన్‌‌చార్జ్‌‌గా, నవీన్ ఐటీ ఎంప్లాయ్‌‌గా హైదరాబాద్‌‌లో పని చేస్తున్నారు. ఆదివారం పోలింగ్ ఉండడంతో శనివారం రాత్రి బైక్‌‌పై సొంతూరుకు బయలుదేరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌‌పూర్ మండలం రాఘవాపూర్ వద్ద నేషనల్ హైవేపై.. వీరి బైక్‌‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కల్యాణ్, నవీన్ స్పాట్‌‌లోనే చనిపోయారు.