
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని అన్నారు. వరద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్డీఆర్ ఎఫ్, రెస్క్యూ టీం లను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని తెలిపారు. అటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సీఎం విజ్జప్తి చేశారు.
ఇరిగేషన్ శాఖ అప్రమత్తంగా ఉండాలి :
గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని ఈ నేపథ్యంలో, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
రెవెన్యూ సదస్సులు వాయిదా :
భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11 న ప్రగతి భవన్ లో నిర్వహించతలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ‘రెవిన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు.., 15 వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించతలపెట్టిన ‘రెవిన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీఎం తెలిపారు.వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు.