తుమ్మల పోతే లాభమా? నష్టమా?..ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్

తుమ్మల పోతే లాభమా? నష్టమా?..ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్
  • భద్రాద్రి జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులకు పిలుపు
  • వనమాకు లేని సమాచారం.. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్గాల్లో చర్చ 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : మాజీ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడితే ఏమైనా నష్టం ఉంటుందా అనే అంశంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థులు రేగా కాంతారావు, భానోత్ హరిప్రియ, మెచ్చ నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావ్‌‌‌‌లకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. మంత్రి పువ్వాడ ఈ నలుగురిని వెంటబెట్టుకొని శనివారం హైదరాబాద్ వెళ్లారు. కాగా, వీరిలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు లేకపోవడం, అసలు ఆయనకు పిలుపు రాకపోవడంపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఐదు నియోజకవర్గాలపై తుమ్మలకు పట్టు..

తుమ్మల నాగేశ్వర్ రావుది అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని గండుగుల పల్లి. ఈయన పాలేరు నుంచి టికెట్ ఆశించారు. అయితే, కందాల ఉపేందర్ రెడ్డికే హైకమాండ్ టికెట్ కేటాయించింది. దీంతో అలిగిన తుమ్మలను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన ఆయన.. బీఆర్ఎస్ జెండాలు లేకుండా వెయ్యి కార్లతో బల ప్రదర్శన చేసి, హైకమాండ్‌‌‌‌కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌‌‌‌పై నమ్మకం కోల్పోయిన ఆయన.. కాంగ్రెస్‌‌‌‌లోకి వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. 

తుమ్మలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలపై మంచి పట్టుంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌‌‌‌లో చేరితే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఈ నేపథ్యంలో తుమ్మల పార్టీని వీడితే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కుఏ మేరకు నష్టం ఉంటుందో తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్, ఎస్బీ నుంచి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కొంత సమాచారం తెప్పించుకున్నారు. 

ఆ నలుగురితో సీఎం భేటీ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, భానోత్ హరిప్రియ, మెచ్చ నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావుతో పాటు భద్రాచలం నుంచి పోటీ చేస్తున్న తెల్లం వెంకట్రావును శనివారం హైదరాబాద్‌‌‌‌కు పిలిపించారు. అప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎమ్మెల్సీ మధుసూదనరావు హైదరాబాద్‌‌‌‌లో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వీరితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రి తుమ్మల పార్టీని వీడితే ఎలాంటి ప్రభావం ఉంటుందోనని ఆరా తీశారు.​ ఇదిలా ఉండగా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గాను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఆహ్వానం లేకపోవడం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.