నిస్వార్థ నేత ఉప్పల మల్సూరు.. ( ఇవాళ సూర్యాపేట తొలి ఎమ్మెల్యే ఉప్పల మల్సూరు వర్థంతి )

నిస్వార్థ నేత ఉప్పల మల్సూరు.. ( ఇవాళ  సూర్యాపేట తొలి ఎమ్మెల్యే  ఉప్పల మల్సూరు వర్థంతి )

నిస్వార్థ నాయకుడు, నిజాయితీకి నిలువెత్తు  ప్రజా ప్రతినిధి సూర్యాపేట  తొలి  ఎమ్మెల్యే  ఉప్పల  మల్సూరు.  ఆయన  నిబద్ధతతో,  నిస్వార్థంగా  ప్రజాసేవ  చేశారు.   నాలుగుసార్లు  ఎమ్మెల్యేగా  విశిష్ట  సేవలందించారు.  ఆయన  నిజాయితీని నమ్మి   సొంతూరి  ప్రజలు   సర్పంచ్ గానూ ఏకగ్రీవం  చేశారు.  అయినా.. ఎలాంటి  బేషజాలకు పోలేదు.  చిన్న పదవి అని వద్దన లేదు.  ప్రజలు మెచ్చి కట్టబెట్టిన ఏ పదవినైనా అంకితభావంతో  తీసుకుని సేవలందించారు. ఎమ్మెల్యేగా కాలినడకనే  ప్రయాణం సాగించారు. అసెంబ్లీ  సమావేశాలకు మాత్రమే  బస్సులో  వెళ్లి వచ్చేవారు.  అంతటి   సాధారణ  ప్రజాజీవితం  గడిపిన ఆదర్శ నేత,  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు,  కమ్యూనిస్టు  నేత  ఉప్పల మల్సూరు. 

బాల్యంలోనే  తెలంగాణ సాయుధ పోరుబాట..

తెలంగాణలోని  సూర్యాపేట  జిల్లా  మోతె  మండలం  సిరికొండలో  1928లో  దళిత  కుటుంబంలో  ఉప్పల  మల్సూరు  జన్మించారు.  బాల్యంలోనే  కమ్యూనిస్టు  భావాలకు  ఆకర్షితులై  తెలంగాణ సాయుధ  రైతాంగ పోరుబాటలో నడిచారు.  ప్రముఖ కమ్యూనిస్టు నేతలు  పుచ్చలపల్లి  సుందరయ్య,  భీంరెడ్డి  నర్సింహారెడ్డి,  ధర్మభిక్షం,  మద్దికాయల  ఓంకార్,  మల్లు స్వరాజ్యం లాంటివారితో కలిసి ఉద్యమించారు.   పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు.  నల్గొండ,  ఖమ్మం,  గుల్బర్గ  జైళ్లలో  జైలు శిక్ష అనుభవించారు. 1951లో  విడుదల అయ్యారు.  ఆనాటి  కమ్యూనిస్టు  అధినేతల  ఆదేశాలతో  1952లో  హైదరాబాద్  రాష్ట్ర తొలి  అసెంబ్లీ  ఎన్నికల్లో  ఉప్పల  మల్సూరు  సూర్యాపేట  అసెంబ్లీ  స్థానానికి  పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) నుంచి తొలిసారిగా  ఎమ్మెల్యేగా  పోటీచేసి గెలిచారు.  ఇలా వరుసగా  నాలుగుసార్లు విజయం  సాధించారు. 1964లో  సీపీఐ పార్టీలో  చీలిక రావటంతో  సీపీఎంలోకి  వెళ్లారు.  1972  వరకు  ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహించారు.   హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీలోనూ సూర్యాపేట   నుంచి తొలి ఎమ్మెల్యేగా  ఉప్పల మల్సూరు  ప్రజాప్రతినిధిగా వ్యవహరించారు. 

భుజాన సంచితో కాలినడకన ప్రయాణం

ఎమ్మెల్యేగా  నియోజకవర్గమంతా భుజాన సంచితో కాలినడకన తిరిగేవారు.  సంచిలో  స్టాంపు, ప్యాడ్ ఉండేవి.  గ్రామాల్లో  ప్రజలు ఎదురుపడి తమ సమస్యలను చెబితే.. అక్కడే పేపర్​పై రాసి సంతకం పెట్టి ఇచ్చి అధికారులను కలవమనేవారు.  ఆపై  సమస్య  పరిష్కారమయ్యే దాకా  వదిలిపెట్టేవారు కాదు.  దీంతో  ఆయనను  ప్రజలు ఇంకు ప్యాడ్‌‌  ఎమ్మెల్యే  అని  ప్రేమగా  పిలిచేవారు.  

పేదల  ప్రతినిధిగా.. 

ఐదు దశాబ్దాలు  ప్రజాసేవలో బతికినా  ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. హైదరాబాద్​లో  అసెంబ్లీ  సమావేశాలకు  బస్సులో  వెళ్లేవారు.  అసెంబ్లీకి  హాజరైతే  వచ్చే రూ.250లోంచి  రూ.150 పార్టీకి  విరాళంగా  ఇచ్చేవారు.  తనకున్న  ఆస్తిలోనే   గ్రామ పాఠశాలకు  రెండున్నర  గుంటల జాగాను   దానంగా ఇచ్చారు.   నాలుగుసార్లు  ఎమ్మెల్యేగా  పని చేసినా  ఆయనకు  నాటి  ప్రభుత్వాలు  కనీసం  పింఛన్‌‌  కూడా ఇవ్వలేదు.   అయినా.. పింఛన్‌‌  కోసం  కూడా  ఆశ పడకుండా  చెప్పులు  కుడుతూనే  కుటుంబాన్ని పోషించారు. పార్టీని కూడా నడిపారు.  ఇది  ఆయన ప్రజాసేవకు,  త్యాగనిరతికి  నిదర్శనం.   సర్పంచిగా ఉండగానే 1999 జనవరి 13న  ఉప్పల మల్సూరు  సొంతూరిలో  తుదిశ్వాస విడిచారు.  ఎమ్మెల్యేగా..   సర్పంచిగా  చేసినా..  ఏనాడు  పదవిని తన వ్యక్తిగత స్వార్థానికి  వాడుకోలేదు.  నేటికీ  ఆయన  కుటుంబ సభ్యులు  పూరి గుడిసెలోనే ఉంటున్నారు.  కూలి పని చేసుకుంటున్నారు.  ప్రస్తుత  రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటిని  మంజూరు చేయాలని మల్సూరు కుటుంబ సభ్యులు  కోరుతున్నారు.  సూర్యాపేట జిల్లాకు మల్సూరు పేరు పెట్టాలనే డిమాండ్  జిల్లా  ప్రజల  నుంచి  ఉంది.  నిస్వార్థంగా, నిజాయితీతో ప్రజాసేవకు అంకితమైన  ఆయన విగ్రహాన్ని  సూర్యాపేట జిల్లా కేంద్రంలో  ఏర్పాటు  చేయాల్సిన బాధ్యత ప్రస్తుత  ప్రభుత్వంపై ఉంది.  

 - వేల్పుల సురేష్,
సీనియర్ జర్నలిస్ట్