సెప్టెంబర్ చివరి వారం నుంచి గ్రౌండ్​లోకి కేసీఆర్

సెప్టెంబర్ చివరి వారం నుంచి గ్రౌండ్​లోకి కేసీఆర్

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ వచ్చే వారం నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 21న 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్,​ ఆ తర్వాత మెదక్, సూర్యాపేటలో కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ భవనాలు ప్రారంభించి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ నెల 16న పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్​ను ప్రారంభించి, కొల్లాపూర్ సభలో పాల్గొన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకువస్తారేమోననే అనుమానంతో ప్రచారాన్ని కాస్త స్లో చేసిన గులాబీ బాస్.. డిసెంబర్​లోనే ఎన్నికలు ఉంటాయన్న క్లారిటీ రావడంతో మళ్లీ ఫీల్డ్​లోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో భూపాలపల్లి కలెక్టరేట్​ను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ లోపే ఇంకా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అక్టోబర్ 16న వరంగల్ నిర్వహించే భారీ బహిరంగ సభ నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలోనే నిమగ్నమవుతారని చెప్తున్నారు. అప్పటి వరకు ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో రెండు, మూడు పర్యాయాలు జిల్లాలకు వెళ్లే అవకాశముందని సమాచారం.

సంక్షేమ పథకాలు వివరిస్తున్న లీడర్లు

డబుల్​బెడ్రూం ఇండ్ల పంపిణీ, బీసీల్లో కుల వృత్తిదారులు, మైనార్టీలకు రూ.లక్ష సాయం పంపిణీ పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫీల్డ్​లోనే ఉన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ కేసీఆర్ ను, బీఆర్ఎస్​నే గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు తలోదిక్కు ఎన్నికలే టార్గెట్​గా పని చేసుకుపోతున్నారు. గ్రామ స్థాయిలో లీడర్లను పార్టీలో చేర్చుకోవడం, ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. బలమైన నేతలు వస్తే హైదరాబాద్​లో, లోకల్ లీడర్లకు ఎక్కడికక్కడే కండువాలు కప్పుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడంతో నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. 

ఎన్నికల తేదీలను బట్టి ప్రచార సభలు

గణేశ్ మండపాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు పూజల్లో పాల్గొంటున్నారు. వరంగల్ బహిరంగ సభ తర్వాత ఎన్నికల తేదీలను బట్టి కేసీఆర్ ప్రచార సభల తేదీలను ఖరారు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్​తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ రోడ్​షోలు, సభలు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లా ప్రచార బాధ్యతలు హరీశ్ రావుకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రచార బాధ్యతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అప్పగించారు. కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జ్​గానూ కవితనే వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారంతో పార్లమెంట్ ప్రత్యేక సెషన్​ముగియనుంది. ఎంపీలందరూ రాష్ట్రానికి తిరిగి వచ్చి వాళ్లకు ఇన్​చార్జ్ ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారు.