హుజూరాబాద్​లో నెగిటివ్ రిపోర్ట్.. రంగంలోకి కేసీఆర్​

హుజూరాబాద్​లో నెగిటివ్ రిపోర్ట్.. రంగంలోకి కేసీఆర్​
  • రంగంలోకి కేసీఆర్​
  • హుజూరాబాద్​లో పరిస్థితులు 
  • అనుకూలంగా లేవనే రిపోర్టులతో అలర్ట్ 
  • ప్రగతి భవన్​లో హరీశ్​తో మంతనాలు
  • సెగ్మెంట్​లో ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జ్
  • మరికొంత మంది ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు 
  • దళిత బంధు లబ్ధిదారులతో గ్రూపులు
  • కుల సంఘాలతో ఎప్పటిలెక్కనే మీటింగ్​లు
  • ఒక్కో ఓటరుతో నాలుగైదు సార్లు ములాఖత్​లు
  • ప్రచారం ముగిసే దాకా సెగ్మెంట్​లోనే ఎమ్మెల్యేలు
  • పలువురు లీడర్లతోనూ చర్చించిన కేటీఆర్​

హైదరాబాద్‌‌, వెలుగు: హుజూరాబాద్​పై కేసీఆర్ నజర్​ పెట్టారు. స్పెషల్​గా అక్కడే దళిత బంధు ప్రవేశపెట్టినా.. పెండింగ్​ పనులన్నీ ముందరేసుకొని చేయిస్తున్నా.. సెగ్మెంట్​లో టీఆర్​ఎస్​కు అంతగా పట్టుచిక్కలేదని భావిస్తున్న ఆయన ఇప్పుడు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. రిపోర్టులు కూడా అనుకూలంగా రాకపోవడంతో ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే రంగంలోకి దిగారు. బైపోల్‌‌ ఇన్‌‌చార్జిగా ఉన్న మంత్రి హరీశ్‌‌రావును బుధవారం ప్రగతి భవన్‌‌కు పిలిపించుకొని మూడు గంటల పాటు మంతనాలు జరిపారు. గ్రౌండ్‌‌ లెవల్​లో పరిస్థితి ఎట్లుందని ఆరా తీశారు. టీఆర్‌‌ఎస్‌‌ బలాబలాలతో పాటు ప్రత్యర్థి పరిస్థితి, పార్టీకి కలిసివచ్చే అంశాలపై వివరాలు సేకరించారు.  మొన్నటి గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే ఈ ఉప ఎన్నికలోనూ కేసీఆర్‌‌ అన్నీతానై ప్రచార బాధ్యతలు పర్యవేక్షించనున్నారు. మరోవైపు టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ కూడా బుధవారం సాయంత్రం బేగంపేట క్యాంపు ఆఫీసులో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై హుజూరాబాద్​ వ్యూహాలపైనే చర్చించారు. 

సెగ్మెంట్​లోనే లీడర్ల మకాం
హుజూరాబాద్‌‌ ఇన్‌‌చార్జిలుగా ఉన్న ముగ్గురు మంత్రులు, పది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉప ఎన్నిక ప్రచారం ముగిసే వరకు నియోజకవర్గాన్ని దాటి బయటికి రావొద్దని కేసీఆర్​ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్‌‌ సెక్రటరీలు, సెక్రటరీలు కూడా రెండు, మూడు రోజుల్లో ప్రచార బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. ఒక్కో మండలానికి ముగ్గురు నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఇన్‌‌చార్జులుగా వ్యవహరిస్తారని చెప్పారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌‌చార్జిని నియమించి, ప్రతి రెండు రోజులకు సదరు ఇన్‌‌చార్జీ ఆయా ఓటర్లను కలిసేలా చూడాలన్నారు. మంత్రులు మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఆ తర్వాత హుజూరాబాద్‌‌కు వెళ్లిపోవాలని కేసీఆర్‌‌  ఆదేశాలు ఇచ్చారు.

కుల సంఘాలతో భేటీలు కంటిన్యూ
హుజూరాబాద్​ నియోజకవర్గంలో కుల, కార్మిక, ఇతర సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు కొనసాగించాలని కేసీఆర్‌‌ ఆదేశించారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న సమావేశాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, అదే టెంపో కంటిన్యూ చేయాలని సూచించారు. కులాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తోడు అవసరమైతే మంత్రులు కూడా సమావేశాల్లో పాల్గొంటారని చెప్పారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓటర్లకు కుల సంఘాల భవనాలతో పాటు ఇతర హామీలన్నీ నెరవేరుస్తామనే బలమైన నమ్మకం ఇవ్వాలన్నారు. దళిత బంధు కారణంగా ఏ ఒక్క ఓటరు టీఆర్‌‌ఎస్‌‌కు దూరం కాకుండా చూసుకోవాలని చెప్పారు. 

దళిత బంధు లబ్ధిదారులతో గ్రూపులు
దళిత బంధు లబ్ధిదారులతో గ్రూపులు ఏర్పాటు చేయాలని కేసీఆర్​ సూచించారు. ఒక్కో గ్రూపులో పది నుంచి 15 మంది సభ్యులుగా ఉండేలా చూడాలన్నారు. వారిని నిరంతరం మానిటరింగ్‌‌ చేస్తూ 48 వేలకు పైగా దళితుల ఓట్లు టీఆర్‌‌ఎస్‌‌కే  పోలయ్యేలా జాగ్రత్త పడాలని చెప్పారు. వేరే  ప్రాంతాల్లో ఉన్నోళ్లు దళితబంధు కోసం నియోజకవర్గానికి వచ్చేశారని, ఇతర ప్రాంతాల్లోని  మిగతా కులాల ఓటర్లనూ పోలింగ్‌‌కు ముందే రప్పించేలా చూడాలన్నారు.

ఓటర్లందరినీ నాలుగైదు సార్లు కలువాలె
హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలోని 2,36,430 మంది ఓటర్లను పోలింగ్‌‌ తేదీలోపు నాలుగైదు సార్లు కలువాలని కేసీఆర్‌‌ సూచించారు. ఇప్పటికే ఒక్కో ఓటరును మూడు, నాలుగు సార్లు పార్టీ నేతలు, ఇన్‌‌చార్జిలు కలిశారు. ఎన్నికల షెడ్యూల్‌‌ విడుదల కావడంతో ఇన్నాళ్లూ చేసిన ప్రచారం కన్నా, ఇప్పుడు వారిని మెప్పించే తీరుతోనే మంచి ఫలితం ఉంటుందని సీఎం చెప్పినట్టు తెలిసింది. 

నాన్‌‌లోకల్‌‌ లీడర్లతో చిక్కులేమైనా ఉన్నయా?
ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీ నాన్‌‌లోకల్‌‌ లీడర్లను మోహరించడం  సమస్యగా మారిందా అని కేసీఆర్​ ఆరా తీశారు.  దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమికి ఇదే ఫార్ములా కారణమని కేసీఆర్‌‌ అన్నట్టుగా తెలిసింది. హుజూరాబాద్​ నియోజకవర్గానికి చెందిన  లీడర్లు టీఆర్‌‌ఎస్‌‌లో చేరినా వారంతా పార్టీకి హార్ట్‌‌ఫుల్‌‌గా పనిచేయడం లేదనే ఫీడ్‌‌బ్యాక్‌‌ ఉంది. పైకి గులాబీ కండువాలు వేసుకొని తిరుగుతున్నా, అంతర్గతంగా కొందరు ఈటల వైపే మొగ్గుతున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే నాన్‌‌లోకల్‌‌ లీడర్లను ఎక్కువగా హుజూరాబాద్​లో ప్రచారానికి ఉపయోగించాల్సి వస్తుందని హరీశ్‌‌ చెప్పినట్టు తెలిసింది. 

ఇంకొందరికి బైపోల్‌‌ టాస్క్‌‌ ఇచ్చిన కేటీఆర్
హుజూరాబాద్‌‌లో గెలిచేందుకు ఎత్తుగడలు రూపొందించే పనిలో కేసీఆర్‌‌ నిమగ్నం కాగా.. టీఆర్​ఎస్​  వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ మాత్రం మరికొందరు లీడర్లకు బైపోల్‌‌ టాస్క్‌‌ అప్పగించారు. బుధవారం సాయంత్రం బేగంపేట క్యాంపు ఆఫీసులో ఆయన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరైనట్టు తెలిసింది. వారందరూ రెండు, మూడు రోజుల్లోనే హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లాలని ఇప్పటికే ఆదేశించినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలతో సంబంధం లేకుండా వాళ్లందరూ బై పోల్‌‌ ముగిసే వరకు గ్రౌండ్‌‌లోనే ఉండి పనిచేయాలని కేటీఆర్‌‌ సూచించినట్టు సమాచారం. గ్రౌండ్‌‌ రియాలిటీ ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని చెప్పినట్టు తెలిసింది. పార్టీని గెలిపించేందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని ఉపయోగించుకోవాలని, ఎన్నికల ప్రచారం ముగిసే వరకు హుజూరాబాద్‌‌ విడిచి రావొద్దని తేల్చిచెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉప ఎన్నిక ప్రచార బాధ్యత అప్పగిస్తామని చెప్పినట్టు తెలిసింది.

ప్రచారం ముగిసే ముందు రోజు కేసీఆర్‌‌ సభ
హుజూరాబాద్​లో ప్రచారం అక్టోబర్​ 27న ముగియనుంది. అంతకు ముందురోజు 26న సీఎం కేసీఆర్‌‌ అక్కడ సభ నిర్వహించే అవకాశముంది. దళితబంధు ప్రారంభం కోసం ఇప్పటికే ఒకసారి ఆయన హుజూరాబాద్‌‌కు వెళ్లారు. ఇంటెలిజెన్స్‌‌తో పాటు పలు సర్వే ఏజెన్సీలను రంగంలోకి దించి అక్కడి ఓటర్ల మూడ్‌‌ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సర్వేల ఆధారంగా సెగ్మెంట్​లో పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులకు గ్రీన్‌‌ సిగ్నల్‌‌  ఇచ్చారు. నామినేషన్లు అయిపోయాక గ్రౌండ్​లెవల్​లో పరిస్థితులు, వాటికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ప్రచారానికి వస్తానని మంత్రి హరీశ్​తో కేసీఆర్​ చెప్పినట్టు తెలిసింది.