రుణమాఫీ అమలు బాధ్యత మంత్రి హరీశ్​కు.. టైమ్​కు పూర్తి చేసే టాస్క్​ అప్పగించిన సీఎం

రుణమాఫీ అమలు బాధ్యత మంత్రి హరీశ్​కు.. టైమ్​కు పూర్తి చేసే టాస్క్​ అప్పగించిన సీఎం

లక్షల మంది రైతుల వ్యవహారం కావడంతో రోజూ రివ్యూ
రూ.95 వేల నుంచి రూ.లక్ష పంట రుణం ఉన్నోళ్లే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీని పూర్తిగా అమలు చేసే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. సెప్టెంబర్​ రెండో వారంలోగా రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో.. ఆలోగా టాస్క్​ను పూర్తి చేయాలని హరీశ్​కు సూచించినట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తీసుకున్న నిర్ణయం కావడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సమస్యగా మారుతుందని.. రుణమాఫీపై ప్రతిరోజు రివ్యూ చేయాలని సూచించారు.

పంట రుణాల మాఫీకి దాదాపు రూ.19 వేల కోట్లు అవసరం కాగా... సర్కార్ ఖజానాలో సరిపడా నిధులు లేవు. అయితే తప్పని పరిస్థితుల్లో మాఫీ ప్రకటన చేసిన ప్రభుత్వం రైతుబంధు తరహాలో విడతల వారీగా పంట రుణాలు మాఫీ చేస్తామని తెలిపింది. దీంతో రోజువారీగా ఎంత మొత్తం రిలీజ్ చేస్తే.. సెప్టెంబర్ రెండో వారంలోగా రైతురుణ మాఫీ పూర్తవుతుందనే దానిపై అధికారులతో హరీశ్ ఒక రిపోర్టు తయారు చేయించారు. దానికి అనుగుణంగా రోజుకు కొంతమందికి రుణమాఫీ పైసలు జమ చేస్తారు. మాఫీ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.18,241 కోట్లకు బీఆర్వో ఇచ్చింది. ఇందులో ఇప్పటికే మాఫీ చేసినవి పోగా.. రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్య ఉన్న పంట రుణాల మాఫీ కోసం రూ.237.85 కోట్లను రిలీజ్ చేసింది. మాఫీ కావాల్సిన రుణాల్లో అత్యధికంగా రూ.95 వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్నవే ఎక్కువ, ఈ మొత్తం రూ.12,796 కోట్లు ఉంది. దాదాపు 23.80 లక్షల మంది రైతులు ఈ కేటగిరిలోనే ఉన్నారు. దీంతో సెప్టెంబర్​లోనే ఎక్కువ నిధులు అవసరం కానున్నాయి.

23.80 లక్షల మందికిరూ.12,796 కోట్లు అవసరం

ఈ నెల మూడో తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం 45 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నది. దీంతో ప్రతి రోజు యావరేజ్​గా రూ.406 కోట్లు రైతుల ఖాతాలకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిధుల సర్దుబాటు ప్రకారం ఒక్కోరోజు అంత మొత్తం రిలీజ్ చేయకపోయినా.. రెండు , మూడు రోజుల మొత్తం కూడా ఒక్కసారే ఇవ్వాలని మంత్రి ఫైనాన్స్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు పూర్తిగా నిధుల సమీకరణ ఎలా అనేదానిపై దృష్టిపెట్టారు. ఎక్కడి నుంచి ఎంత వస్తుంది? అందులో రుణమాఫీకి ఎంత రిలీజ్ చేయాలి అనే విధంగా ముందుకు వెళ్తున్నారు.

వరుసగా భూముల అమ్మకం, మూడు నెలల ముందు వైన్స్​లకు టెండర్లు, నోటరీ ఆస్తుల రిజిస్ట్రేషన్, 58,59 జీవోల రెగ్యులరైజషన్ వంటివి వేగవంతం చేశారు. ఈ నెల 22వ తేదీ కల్లా వైన్స్​లకువేసిన అప్లికేషన్లతో, అందులో టెండర్లు దక్కించుకున్నవాళ్లు కట్టే ఎక్సైజ్ టాక్స్ ఫస్ట్ ఇన్​స్టాల్​మెంట్​తో రూ.2 వేల కోట్లపైనే వస్తుంది. దీంతో పాటు 58,59 జీవోల రెగ్యులరైజేషన్ తో రూ.1500 కోట్లు, వరుస పెట్టి అమ్ముతున్న భూములతో కనీసంగా రూ.8–10 వేల కోట్లు వచ్చేలా ప్లాన్​ చేశారు. ఇక ఓఆర్ఆర్​కు సంబంధించి రూ.7,300 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఈ మొత్తం కలిపితే దాదాపు రూ.21 వేల కోట్లు వస్తాయని అంచనా. ఇక రెగ్యులర్​గా ఆర్బీఐ నుంచి యావరేజ్​గా తీసుకునే అప్పులు రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల దాకా ఉంటుంది.