మేనిఫెస్టోపై కేసీఆర్ కసరత్తు .. పార్టీ సీనియర్​ లీడర్లతో చర్చలు

మేనిఫెస్టోపై కేసీఆర్ కసరత్తు .. పార్టీ సీనియర్​ లీడర్లతో చర్చలు
  • 16న వరంగల్ బహిరంగ సభలో మేనిఫెస్టో విడుదల
  • మూడు, నాలుగు కొత్త పథకాలు ప్రకటించే చాన్స్
  • కొత్తగా రైతులు, మహిళలకు పింఛన్లు.. 
  • గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ప్రకటించే అవకాశం 
  • రైతుబంధు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, 
  • ఆసరా పింఛన్ల సాయం పెంచే చాన్స్

హైదరాబాద్, వెలుగు:  ఎన్నికల మేనిఫెస్టోపై బీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్​ కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ప్రకటించాలనే దానిపై ప్రొఫెసర్లు, రిటైర్డ్​ ఐఏఎస్ ​అధికారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పార్టీ సీనియర్​ లీడర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు కొత్తగా మూడు, నాలుగు స్కీమ్​లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఆయా స్కీమ్​లు ప్రకటిస్తే రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది, ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పథకాలకు నిధుల సర్దుబాటు తదితర అంశాలపై ఆయన చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 

మేనిఫెస్టో రూపకల్పనపై పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు పలువురు నాయకులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, రూరల్ ​డెవలప్​మెంట్ తదితర రంగాలకు చెందిన నిపుణులతో ప్రతిరోజు ప్రగతిభవన్​లో సమాలోచనలు చేస్తున్నారు. గత వారం రోజులుగా వాళ్లంతా మేనిఫెస్టో రూపకల్పనపైనే ఫోకస్ పెట్టారు. వాళ్లతో ప్రతిరోజు కొంతసేపు కేసీఆర్​ సమావేశమై స్కీమ్ లపై చర్చిస్తున్నారు. ఈ వారంలోనే మేనిఫెస్టోకు తుదిరూపు ఇవ్వనున్నారు. వరంగల్​లో ఈ నెల 16న నిర్వహించే బీఆర్ఎస్​సభలో మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు. 

వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకో పథకం.. 

ఈసారి రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​పథకాల కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచనున్నట్టు తెలిసింది. రైతుబంధు సాయం ఎకరానికి ఇంకో వెయ్యి చొప్పున పెంచి, ఒక్కో సీజన్​కు ఎకరాకు రూ.6 వేలు ఇచ్చే అవకాశముంది. ఇక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​సాయాన్ని రూ.1,01,116 నుంచి రూ.1,25,116కు పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల సమయంలో ఆసరా వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గించారు. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఇతరులకు రూ.2,116, వికలాంగులకు రూ.4,116 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. ఈసారి వృద్ధాప్య, వితంతు పింఛన్లను మరో రూ.వెయ్యి పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. 

రైతులకు తోడ్పాటును అందించేందుకు ‘రైతు పింఛన్’, మహిళలను ఆకట్టుకునేందుకు ‘మహిళా పింఛన్’​ కూడా ప్రకటించే అవకాశం ఉంది. పేద, మధ్య తరగతి కుటుంబాలపై గ్యాస్​సిలిండర్ల భారం అధికంగా ఉండడంతో ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు. ఏడాదికి ఆరు సిలిండర్లకు 30 నుంచి 40 శాతం సబ్సిడీ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ఆయా వర్గాలను ఆదుకునేందుకు ఒక కొత్త స్కీమ్ ప్రకటిస్తారని తెలుస్తోంది. పెట్రోల్​పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్​లోనూ కొంత తగ్గిస్తే ఎలా ఉంటుందనే దానిపైనా చర్చిస్తున్నారు. 

యువతపై ఫోకస్

రాష్ట్రంలో తొమ్మిదేండ్లకు పైగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ​ప్రభుత్వంపై యువతలో ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి రూ.3,116 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. జాబ్​ క్యాలెండర్​ నిర్దిష్టంగా అమలు చేయడం లేదు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇప్పుడు ఇంకో 60 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రైవేట్​సెక్టార్​లోనూ భారీ ఎత్తున ఉద్యోగ కల్పన చేస్తున్నామని చెప్తున్నప్పటికీ, ఆ ఉద్యోగాలేవీ స్థానికులకు రావడం లేదని యువతలో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువతను ఆకట్టుకునేలా ఒక స్కీమ్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 

నిరుద్యోగ భృతిలాగా నగదు ఇచ్చేలా కాకుండా స్కిల్​డెవలప్​మెంట్, ప్రైవేట్​సెక్టార్​లో ఉద్యోగాల కల్పనపై హామీ ఇస్తారని సమాచారం. రాష్ట్రంలో ఏ ప్రైవేట్​ కంపెనీ నెలకొల్పినా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అగ్రిమెంట్ ​చేసుకుంటున్నా అది అమలు కావడం లేదు. దీన్ని మేనిఫెస్టోలో చేర్చి ఆయా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని ప్రకటించే చాన్స్​ఉంది. ఏటా రిటైర్​మెంట్లతో ఖాళీ అయ్యే ఉద్యోగాలకు అదే ఏడాది నోటిఫికేషన్ ​ఇచ్చి భర్తీ చేస్తామని సైతం హామీ ఇవ్వనున్నారు. ఇప్పటికే జాబ్​క్యాలెండర్​ పేరుతో ఇలాంటి హామీ ఇచ్చినా అది అమలు కావడం లేదు. దీన్ని స్ట్రీమ్​లైన్ ​చేస్తామని ప్రకటించే అవకాశముంది.

కాంగ్రెస్​ గ్యారంటీలకు దీటుగా.. 

తుక్కుగూడ సభలో కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. తమను గెలిపిస్తే వంద రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ గ్యారంటీల్లో రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలపై గ్రౌండ్​ లెవల్ లో మంచి రెస్పాన్స్​ ఉన్నట్టు ఇంటెలిజెన్స్​సర్వేల్లో తేలింది. దీంతో ఆయా వర్గాలను టార్గెట్​ చేసేలా బీఆర్ఎస్​ ఎన్నికల మేనిఫెస్టో ఉండనుంది. ఇదే విషయాన్ని హరీశ్​రావుతో పాటు పలువురు మంత్రులు సభల్లో చెబుతున్నారు. కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలను తలదన్నేలా బీఆర్ఎస్​ మేనిఫెస్టో రూపొందిస్తున్నామని అంటున్నారు. మేనిఫెస్టోతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

ప్రస్తుత స్కీమ్​లకు ఇచ్చే సాయం పెంచడంతో పాటు కొత్త స్కీమ్​లతో పడే ఆర్థిక భారం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వెసులుబాటు, ప్రజాసంక్షేమం కోసం తమ ముందున్న ప్రణాళికలను వివరించడానికి ఆయన సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 16లోపే ఎన్నికల షెడ్యూల్​ వచ్చే అవకాశం ఉండడంతో వరంగల్​ బహిరంగ సభ తర్వాత పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం ప్రారంభించే ఆలోచనలో కేసీఆర్​ ఉన్నట్టు తెలిసింది.