
- ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు చెప్పుకునేందుకు పెండింగ్ పనులపై కేసీఆర్ ఫోకస్
- నిలదీసే చాన్స్ ప్రతిపక్షాలకు ఇవ్వకుండా ముందు జాగ్రత్త
- వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు..‘డబుల్’ ఇండ్ల పంపిణీకి చర్యలు
- 2018 ‘ప్రగతి నివేదన’ సభ మాదిరి అసెంబ్లీలో ప్రోగ్రెస్ చెప్పుకునే వ్యూహం
టూర్లు.. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను ఇటీవల కేసీఆర్ సందర్శించారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఆ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. స్టాఫ్ క్వార్టర్స్‌తో పాటు అద్భుతమైన టౌన్‌షిప్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐదుగురు మంత్రులు గురువారం రివ్యూ చేశారు. మునుగోడుతో పాటు నల్గొండ జిల్లా అభివృద్ధికి రూ.1,544 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఆదివారం మహబూబ్‌నగర్, ఈ నెల 7న జగిత్యాల జిల్లా పర్యటనకు కేసీఆర్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లు, కొత్త మెడికల్ కాలేజీ భవనాలను ప్రారంభించనున్నారు. ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, టీఆర్‌ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీ శ్రేణులతో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం కేసీఆర్ హడావుడి మొదలు పెట్టారు. శాసనసభలో ప్రభుత్వ పనితీరును గొప్పగా చెప్పుకునేందుకు పెండింగ్ హామీలు, పనులన్నింటిపై ఫోకస్ పెట్టారు. ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అస్త్రాలు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ఏడాది కావటంతో.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే తాము చెప్పిన హామీలన్నీ నెరవేర్చినట్లు చెప్పుకునేందుకు రెండు వారాలుగా వరుస రివ్యూలు చేస్తున్నారు. పర్యటనలు జరుపుతున్నారు. పెండింగ్ ఫైళ్లను కదుపుతున్నారు. సర్కారుపై అసంతృప్తిగా ఉన్న వర్గాల్లో కోపాన్ని చల్లార్చే ప్రయత్నాల్లో భాగంగా.. నిరుద్యోగులు, దళితులు, గిరిజనులతో పాటు ఇతర కులాలపై దృష్టి సారించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్ధిదారులకు అప్పగించడం, సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం, 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణం త్వరగా పూర్తి చేయడం, రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, హైదరాబాద్‌లో కొత్త ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవం సహా అనేక పనులతో అధికారులను బిజీగా ఉంచుతున్నారు.
నిజానికి టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ నెలాఖరున గ్రూప్- 4 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంది. కానీ సీఎంవో సూచనల నేపథ్యంలో ముందుగానే నోటిఫికేషన్‌కు ప్రకటన విడుదల చేసింది. ఇంకో పది వేల ఉద్యోగాల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ మొదటి అసెంబ్లీ రద్దుకు ముందు ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకున్నట్టే.. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను తమ రెండో సర్కారు ప్రోగ్రెస్ రిపోర్ట్ వెల్లడికి వేదికగా మార్చుకోనున్నారు.
లబ్ధిదారులకు త్వరలో డబుల్ బెడ్రూంలు
జిల్లాల వారీగా సిద్ధంగా ఉన్న 62 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించే ప్రక్రియను షురూ చేశారు. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సొంత జాగాల్లో ఇండ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనెలలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి కనీసం 1,500 మందికి రూ.3 లక్షలు చొప్పున ఇచ్చే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1,500 మందికి దళితబంధు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. మొదటి దశలో భాగంగా ఈనెలలో నియోజకవర్గానికి 500 మందికి ఈ స్కీం ఇచ్చే ప్రయత్నాలు వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు - మన బడిలో భాగంగా మొదటి దశలో 1,200 స్కూళ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. వాటిలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఫర్నిచర్ పంపిణీని ఈనెల 15లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం జిల్లాల పర్యటనలో భాగంగా కొన్ని స్కూళ్లను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు.
పనుల్లో వేగం పెంచాలంటూ ఆదేశాలు
సెక్రటేరియెట్‌ను జనవరి 18న ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ఇటీవలే నిర్మాణాన్ని పరిశీలించి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే రోజు తెలంగాణ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఐమ్యాక్స్ పక్కన నిర్మిస్తున్న 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించేలా పనులు చేస్తున్నారు. నగరంలో వరద సమస్య తలెత్తకుండా ఎస్‌ఎన్‌డీపీ పనులు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లోనూ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణాలు మార్చిలోగా పూర్తి చేసి ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. లక్షలోపు రైతు రుణమాఫీని సాగదియ్యకుండా వచ్చే బడ్జెట్‌లోనే నిధులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సేల్స్ టాక్స్ బకాయిలను రద్దు చేశారు. నవంబర్ 15న టీఆర్‌ఎస్ జాయింట్ మీటింగ్ నిర్వహించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా దిశానిర్దేశం చేశారు. ధరణిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించారు.
ప్రచారానికి వేదికగా చేసుకోవాలని..
అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తేందుకు సమస్యలే లేవనేలా.. రాష్ట్రంలో పాలన సుభిక్షంగా సాగిపోతున్నదనే భావన ప్రజలకు కలిగేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈ సెషన్‌ను వేదికగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ.. కేంద్రం విధానాలతోనే మిగతా స్కీములు అమలు చేయలేకపోతున్నామని ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తున్నారు. 2018 సెప్టెంబర్ 6న కేసీఆర్ కేబినెట్.. అసెంబ్లీని రద్దు చేసింది. వారం రోజుల ముందు కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేసి తమ ప్రభుత్వం ఏం చేసింది.. ఇంకా ఏం చేయబోతున్నది కేసీఆర్ వివరించారు. సుమారు 400 పథకాలు తాము అమలు చేస్తున్నట్టు చెప్పుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా తమ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు ఉంచేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. పోడు భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపబోతున్నట్టు అసెంబ్లీ వేదికగానే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
వరుస నోటిఫికేషన్లు
యువత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత కోపంగా ఉన్నారనేది దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తేటతెల్లమైంది. మునుగోడు ఉప ఎన్నికలోనూ సర్కారుపై తమ అసంతృప్తిని యువత వెల్లగక్కింది. వాళ్ల కోపాన్ని చల్లార్చకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనని గుర్తించిన కేసీఆర్.. ఉద్యోగాల భర్తీలో వేగం పెంచారు. సుమారు 80 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చారు. ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమ్స్, పోలీస్ ఉద్యోగాల అర్హత పరీక్షలు నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. సాధారణ గ్రాడ్యుయేట్లు సైతం ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యేందుకు గ్రూప్ -4 నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటిని సాకుగా చూపి నిరుద్యోగ భృతి హామీని వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్‌పై ఫోకస్
ప్రజలకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు చేసి, కళ్లద్దాలు పంపిణీ చేసేందుకు రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరిలో మొదలుపెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 మెడికల్ కాలేజీలను త్వరలో ప్రారంభించనున్నారు. వీటిలో 3,897 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చారు. వరంగల్ మెడికల్ టవర్స్ నిర్మాణంతోపాటు హైదరాబాద్ సిటీకి మూడు వైపులా టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. రాష్ట్ర జనాభాలో 30 శాతానికి పైగా నివాసం ఉంటున్న జీహెచ్‌ఎంసీలో కనెక్టివిటీ పెంచడంపై ఫోకస్ పెంచారు. ఇటీవలే శిల్పా లే ఔట్ నుంచి ఓఆర్‌ఆర్‌ను కనెక్ట్ చేసే ఫ్లై ఓవర్లను ప్రారంభించారు. ఈనెల 9న మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ను కనెక్ట్ చేసే మెట్రో రైల్ రెండో దశకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు జీవో ఇచ్చారు. నెక్లెస్ రోడ్‌లో నీరా కేఫ్ ప్రారంభించే చర్యలు ముమ్మరం చేశారు.