వెలుగు ఓపెన్ పేజీ : సాగులో మితిమీరిన రసాయనాల వాడకం నియంత్రించాలి

 వెలుగు ఓపెన్ పేజీ :  సాగులో మితిమీరిన రసాయనాల వాడకం నియంత్రించాలి

మనిషి ఆనందానికి ఆరోగ్యం ప్రధానమైనది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై  ఆధారపడుతుంది.  మనిషి ఆరోగ్యానికి నాణ్యమైన ఆహారం చాలా  కీలకం.  రెండో ప్రపంచ యుద్ధానంతరం ఆకలితో  అల్లాడుతున్న ప్రపంచానికి ఆహారాన్ని అందించడానికి 1948లో  ఐక్యరాజ్యసమితి 'మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన' (UDHR) ద్వారా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం తగిన ఆహారం అందించాలని  పేర్కొంది.   ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (ICESCR)-1966  ప్రపంచ దేశాలకు పని, విద్య, ఆరోగ్యం,  తగిన జీవన ప్రమాణాలు వంటి హక్కులను పరిరక్షించాలని  నిర్దేశిస్తోంది.  అంత ర్జాతీయ  ప్రమాణాలు,  ఒడంబడికలకు అనుగుణంగా మన దేశ రాజ్యాంగంలోని  ఆదేశిక  సూత్రాలలో 47వ అధికరణం..పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణాలను పెంపొందించడం, ప్రజారోగ్యాన్ని  మెరుగుపరచడం రాష్ట్ర విధిగా పేర్కొన్నది.   అయితే  నేటికీ నాణ్యమైన ఆహారం అందని ద్రాక్షగానే మిగిలింది. ఆహారం  కలుషితం  కావడానికి అనేక కారణాలున్నాయి. 

ఆహారం కలుషితానికి కారణాలు

పర్యావణ మార్పులు, ఉద్దేశపూర్వక దురాచారాలు,  ఆహార సరఫరా గొలుసు నిర్వహణ లోపం వల్ల  నేడు  ఆహారం  కలుషితమవుతోంది.  సాగులో మోతాదుకు మించిన రసాయన  ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల ఆహారం మరింత కలుషితమవుతోంది.  భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రకారం, 2018-–2023 మధ్య కాలంలో కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు, ధాన్యాలు, మాంసం, గుడ్డు, టీ, పాలు,  చేపలు నుంచి  దాదాపుగా 1.30 లక్షలకు పైగా  నమూనాలను సేకరించి విశ్లేషించగా  సుమారుగా 28 శాతం నమూనాలలో పురుగుమందుల అవశేషాలు కనుగొన్నారు, వాటిలో 3.5 శాతం నమూనాలు భారత ఆహార భద్రత,  ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ద్వారా నోటిఫై చేసిన  గరిష్ట అవశేష పరిమితుల (MRLs) కంటే ఎక్కువగా ఉన్నాయని తేలింది. 

రసాయన ఎరువుల వినియోగంతో విషాదాలు

1960 తర్వాత హరిత విప్లవం వల్ల సాగు పద్ధతులు పూర్తిగా మారాయి.  నూతన సంకర విత్తన రకాల వినియోగం ప్రారంభమైంది.  ఈ నూతన సంకర విత్తనాలు పండించడానికి అధికమొత్తంలో  రసాయన ఎరువులు,  పురుగుమందులు ఉపయోగించడం మొదలైంది.  ప్రపంచవ్యాప్తంగా 2023లో  వ్యవసాయంలో మొత్తం పురుగుమందుల వాడకం 3.73 మిలియన్ టన్నులు,  గత  దశాబ్దంతో పోలిస్తే  14 శాతం పెరుగుదల నమోదైంది.  ఇక మన భారతదేశంలో  పురుగు మందుల వినియోగం 2024-–25లో  67,221.22  టన్నులుగా  నమోదైంది.  రసాయన ఎరువుల వినియోగం 2024-–25లో  32.93  మిలియన్  మెట్రిక్ టన్నులు.  ఈ లెక్కలు  సాగులో అధిక రసాయనాల ఉపయోగాన్ని సూచిస్తున్నాయి.   

లేబుల్ క్లెయిమ్

 ప్రపంచంలో సేద్యానికి సంబంధించిన రసాయనాలను నిర్వహణకు  వివిధ దేశాలలో  వివిధ రకాల నిబంధనలు ఉన్నాయి. అంతర్జాతీయంగా కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ (CAC) ప్రపంచంలోని ఆహార ప్రమాణాలు, మార్గదర్శకాలు,  ఆచరణ  నియమావళిని  నిర్వహిస్తున్నది.     మన దేశంలో సేద్యానికి  సంబంధించిన రసాయనాలను, ఎరువుల (నియంత్రణ) ఉత్తర్వు-1985,  పురుగుమందుల చట్టం-1968 ద్వారా  నియంత్రిస్తారు. ఈ చట్టాలు దేశంలోని  సాగు సంబంధిత రసాయనాల ఉత్పత్తి,  నాణ్యత, నియంత్రణ, అమ్మకం,  ధరలను  నిర్దేశిస్తాయి.  ఒక  పురుగుమందును ఒక పంటపై ఉపయోగించడానికి నియంత్రణ సంస్థ ఆమోదించినప్పుడు, ఆ పంట కోసం దానికి ఒక 'లేబుల్ క్లెయిమ్' లభిస్తుంది. ఇది దేశంలో దాని ఆమోదిత 
వినియోగాన్ని చట్టపరమైన అనుమతిని సూచిస్తుంది.  భారతదేశంలో పండించే పంటలలో సుమారుగా 15-–20 శాతం పంటలు మాత్రమే పురుగుమందుల వినియోగం కోసం లేబుల్ క్లెయిమ్‌ను కలిగి ఉన్నాయి. మిగిలిన 80–-85 శాతం పంటలు ఇప్పటికీ పురుగుమందుల  నమోదిత వినియోగం పరిధిలోకి రాలేదు.  ప్రస్తుతం మన దేశంలో నమోదైన కలుపు సంహారకాలు, కీటక 
సంహారకాలు, శిలీంధ్ర  సంహారకాలు,  వృద్ధి నియంత్రకాలు మొదలైన అన్నీ కలిపి మొత్తం దాదాపుగా 368 క్రియాశీల పదార్థాలు నమోదై ఉన్నాయి, ఇది  చైనా (727), జపాన్ (590) ఇతర దేశాలతో  పోలిస్తే చాలా తక్కువ. 

రసాయనాల వినియోగం తగ్గితే నాణ్యమైన ఆహారం
మన రాష్ట్రంలో కేవలం  పురుగుమందుల  పరీక్ష 

ప్రయోగశాలలు  రెండు మాత్రమే ఉన్నాయి.  వాటి సంవత్సరానికి పరీక్ష సామర్థ్యం కేవలం సుమారుగా 3900 మాత్రమే, 2023–-24లో  దేశవ్యాప్తంగా సుమారుగా 80,789 నమూనాలను పరీక్షించగా, మన రాష్ట్రంలో రెండు పరీక్ష ప్రయోగశాలల్లో 3,878 నమూనాలను పరీక్షించడం జరిగింది.  దేశవ్యాప్తంగా నోటిఫై చేసిన ఎరువుల నాణ్యత పరీక్ష ప్రయోగశాలలు  కేవలం 76 మాత్రమే. ఈ లెక్కలను గమనిస్తే  ప్రస్తుతం భారతదేశం మొత్తం ఖరీఫ్,  రబీలో  ప్రతి డీలర్ దుకాణాన్ని ఒకసారి తనిఖీ చేసి లక్షల్లో నమూనాల సేకరించి పరీక్షించడానికి ప్రస్తుతం ఉన్న  ప్రయోగశాలలు,  సిబ్భంది సరిపోదు. కావున సాగులో పెరుగుతున్న రసాయనాల వినియోగాన్ని తగ్గించడానికి  సాగు పద్ధతులు, నియమ నిబంధనలు  అమలుచెయ్యాలి.  సాగులో రసాయనాలను  తగ్గించడానికి  భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) సమీకృత  పంటల నిర్వహణ (ICM) పద్ధతులను రైతులకు అందుబాటులో తెచ్చింది.  సమీకృత  పంటల  నిర్వహణలో సమీకృత పోషక నిర్వహణ (INM),సమీకృత తెగుళ్ల నిర్వహణ (IPM),   సమీకృత వ్యాధి  నిర్వహణ (IDM) అనేవి ప్రధానమైన అంశాలు.  సమీకృత పంటల నిర్వహణను చేపట్టగలిగితే వీలైనంతవరకు  సాగులో  అధిక రసాయన ఉపయోగాన్ని అరికట్టవచ్చు. సరైన రీతిలో సాగు పద్ధతులు, నియమ నిబంధలను అమలుచేస్తే సాగులో మితిమీరిన రసాయనాల వినియోగం తగ్గి  నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చు. 

- డా. రేపల్లె నాగన్న 


ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి.
 స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.