ఇస్లామాబాద్: ఇరాన్-అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తోన్న పాకిస్తాన్ ట్రంప్ ప్రతిపాదనతో ఇరకాటంలో పడింది. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఉద్దేశించిన ‘అబ్రహం ఒప్పందాల్లో' చేరాలని అమెరికా ఒత్తిడి చేయడంతో పాకిస్థాన్ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా మారింది. ఒకవైపు ట్రంప్ ఒత్తిడి.. మరోవైపు దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వం పడిపోయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా డిప్యూటీ చీఫ్, పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి వార్నింగ్ ఇచ్చారు.
పాకిస్తాన్ ప్రభుత్వం, అసిమ్ మునీర్ తీసుకునే ఏ నిర్ణయమైనా ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంటే వారిపై యాక్షన్ సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు. ఓ బహిరంగ సభలో కసూరి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించే ఏ పాకిస్తానీ నాయకుడైనా హింసాత్మక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని కసూరి హెచ్చరించాడు.
అసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ల పేర్లను ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్‌లో ఏ నాయకుడైనా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తే వారిని చంపేస్తామని లేదా సర్వనాశనం చేస్తామని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ గూడచార సంస్థ ఐఎస్ఐ పెంచి పోషించే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా లష్కరే తోయిబా ఏకంగా ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్‌కు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
