సినిమా పిచ్చితో షాపింగ్ మాల్స్ లూటీ.. 32 చోరీల నిందితుడు అనంతపురంలో అరెస్ట్

సినిమా పిచ్చితో షాపింగ్ మాల్స్ లూటీ.. 32 చోరీల నిందితుడు అనంతపురంలో అరెస్ట్
  • బెంగళూరుకు చెందిన నాగరాజుగారి ఆనంద్‌‌గా గుర్తించిన పోలీసులు
  • హీరో అవ్వాలనే పిచ్చితో దొంగతనాలు 
  • చోరీ చేసిన రూ. 2.5 కోట్లతో హారర్ సినిమా స్టార్ట్

తానే హీరోగా సొంతంగా సినిమా తీయాలనే పిచ్చితో  ఓ వ్యక్తి దొంగతనాలు చేసి రూ.2.5 కోట్లు కూడబెట్టాడు. ఒక హారర్ సినిమా స్టార్ట్ చేశాడు. బడ్జెట్ సరిపోకపోవడంతో మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడు. బాలీవుడ్ సినిమా ధూమ్ స్టైల్‌‌‌‌‌‌‌‌లో కేవలం షాపింగ్ మాల్స్‌‌‌‌‌‌‌‌నే టార్గెట్ చేశాడు.  ఏకంగా 3 రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌‌‌‌‌‌‌‌గా మారాడు. చివరకు అనంతపురంలో పోలీసులకు చిక్కాడు.

అమరావతి: తానే హీరోగా సొంతంగా సినిమా తీయాలనేది అతని కల. ఆ పిచ్చితో దొంగతనాలు చేసి రూ. 2.5 కోట్లు కూడబెట్టాడు. ఒక హారర్ సినిమా స్టార్ట్ చేసి అంతా ఖర్చు పెట్టాడు. బడ్జెట్ సరిపోకపోవడంతో సినిమా నిర్మాణం పూర్తవలేదు. ఎలాగైనా డబ్బు సంపాదించి సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడు. సామాన్యుల ఇండ్లను దోచుకుంటే వారు బాధపడతారని.. బాలీవుడ్ సినిమా ధూమ్ స్టైల్‌‌లో కేవలం షాపింగ్ మాల్స్‌‌నే టార్గెట్ చేశాడు.

రీల్ లైఫ్‌‌లో హీరోగా మెరవడం కోసం రియల్ లైఫ్‌‌లో ఏకంగా మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌‌గా మారాడు. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన నాగరాజుగారి ఆనంద్‌‌కు సినిమాలంటే పిచ్చి. తానే స్వయంగా హీరోగా, దర్శకుడిగా మారి 'రిటర్న్ బై ఆనంద్.. పేజీ నంబరు 13' అనే హారర్ సినిమాను మొదలుపెట్టాడు.

ఇందుకోసం గతంలో చేసిన దొంగతనాల సొమ్ముతో పాటు, తన తల్లి పేరిట ఉన్న సొంత ఇంటిని కూడా అమ్మేసి సుమారు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ కూడా జరిపాడు. అయితే, చివరి నిమిషంలో నిధుల కొరత వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. దీనికి తోడు అప్పులు భారీగా పెరిగిపోవడంతో, వాటిని తీర్చడానికి ఆనంద్ మళ్లీ దొంగతనాల బాట పట్టాడు. 

అయితే దొంగతనానికి అతను సామాన్యుల ఇండ్ల జోలికి మాత్రం వెళ్లేవాడు కాదు. ఇండ్లలో దొంగతనం చేస్తే పేదలు, మధ్యతరగతి వారు బాధపడతారని ఆనంద్ భావించేవాడు. పెద్ద మాల్స్ అయితే ధనవంతులు నడుపుతారని, పైగా వాటికి ఇన్సూరెన్స్ (బీమా) ఉంటుంది కాబట్టి ఎవరికీ నష్టం జరగదనే విచిత్రమైన లాజిక్ తో కేవలం షాపింగ్ మాల్స్‌‌ను మాత్రమే లూటీ చేసేవాడు.

32కి పైగా మాల్స్‌‌లో చోరీ
ఇలా ఆనంద్‌‌..ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకంగా 32కి పైగా మాల్స్‌‌లో చోరీలకు పాల్పడి పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌‌గా మారాడు. ఈ క్రమంలోనే జూన్ 27న ఏపీ అనంతపురంలోని ప్రసిద్ధ 'డ్రెస్ సర్కిల్' మాల్‌‌లో భారీ దొంగతనానికి ఒడిగట్టాడు. ఈ కేసును సవాల్‌‌గా తీసుకున్న అనంతపురం పోలీసులు..మాల్‌‌లోని సీసీటీవీ ఫుటేజ్‌‌లను, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలించి ఆనంద్‌‌ను పట్టుకున్నారు.

బాలీవుడ్ సినిమా ‘ధూమ్’ స్టైల్‌‌లో తప్పించుకు తిరుగుతున్న ఈ కిలాడీని పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడి నుంచి 5.25 లక్షల రూపాయల నగదు, దొంగతనానికి వాడిన ఒక కారు, మూడు నంబర్ ప్లేట్లు, ఇనుప రాడ్లు, కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు.