- అర్ధరాత్రి నరమేధం.. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో దారుణం
- ఆరుగురిని అతి కిరాతకంగా చంపిన రాక్షసుడు
- పోక్సో కేసు పెట్టిన బాలిక ఫ్యామిలీపై కక్షతో మారణకాండ
- ముందుగా బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమె తల్లి, నానమ్మ హత్య
- అక్కడి నుంచి బాలికను ఎత్తుకెళ్లి మర్డర్
- ఆ తర్వాత తన సొంత ఇంట్లో కిరాతకం
- భార్య, ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ఊచకోత
- తానూ ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు తండ్రికి ఫోన్
- రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో దారుణం
- జాడలేని కిల్లర్.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
- ఉన్నతాధికారులు సీరియస్.. ఎస్‌ఐ సస్పెన్షన్
హైదరాబాద్/షాబాద్: తనపై పోక్సో కేసు పెట్టిందనే కారణంతో ఓ బాలికపై కక్ష పెట్టుకొని సైకోలా మారిన వ్యక్తి మారణహోమం సృష్టించాడు. అర్ధరాత్రి కత్తితో ఇంట్లో చొరబడి బాలిక కళ్ల ముందే ఆమె తల్లిని, నానమ్మను పొడిచి చంపాడు. అక్కడి నుంచి బాలికను కారులో తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి.. తన సొంత భార్యా పిల్లల గొంతుకోశాడు. ‘‘ఆరుగురినీ చంపేశాను.. నేనూ చస్తున్నాను’’ అంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పి, మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.
అరగంట వ్యవధిలో ఆరుగురిని అతి కిరాతంగా చంపి జాడలేకుండా పోయిన ఆ ఉన్మాది కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఊచకోత.. స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. పోక్సో కేసులో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నిందితుడు బయట తిరుగుతూ6 హత్యలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.
దీంతో చేవెళ్ల –షాద్‌నగర్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఆగ్రహంతో ఉన్న జనం.. ఘటనాస్థలానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై దాడికి యత్నించారు. దీంతో కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి, బాధితులకు నచ్చజెప్పారు. కాగా, పోక్సో కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ రమేశ్‌ను ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్‌జోషి సస్పెండ్ చేశారు. సీఐ కాంతారెడ్డికి చార్జ్ మెమో ఇచ్చారు.
సైకో రాజ్‌కుమార్ ప్రేమ పెళ్లి
దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్(29) ఇంటర్ వరకు చదువుకున్నాడు. మొదటి నుంచి జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలోనే తమ ఇంటి సమీపంలోని యువతి సరిత(35)తో పరిచయం ఏర్పడింది. ఆమెను 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత దైవాలగూడ నుంచి షాబాద్‌కు మకాం మార్చాడు. పీఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి సరితతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. వీరికి పరీక్షిత్ (4), దైవీక్షిత్ (2) ఇద్దరు కుమారులు.
బీఈడీ పూర్తిచేసిన సరిత టెట్‌కు సిద్ధం అవుతోంది. కాగా, రాజ్‌కుమార్ ఇంటి పక్కనే ఓ మైనర్ బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి కొంత కాలం క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా తల్లి లక్ష్మి(45), నాయనమ్మ రుక్కమ్మ(65), మానసిక వైకల్యం కలిగిన అక్కతో కలిసి బాలిక నివాసం ఉంటోంది. శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
లైంగిక వేధింపులు.. పోక్సో కేసులో బెయిల్
పోలీసుల ప్రకారం.. ఇరుగుపొరుగున ఉండడంతో రాజ్‌కుమార్, బాలిక కుటుంబాలకు పరిచయం ఏర్పడింది. అప్పటికే చెడు వ్యసనాలకు బానిసైన రాజ్‌కుమార్ బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ కుటుంబం కదలికలను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. బాలిక కాలేజీకి వెళ్తున్న సమయంలో వెంబడించేవాడు. అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. విషయం రాజ్‌కుమార్ భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
కాగా, రాజ్‌కుమార్ భూమి అమ్మిన పైసలు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి రూ.2.5 కోట్లు నష్టపోయాడు. లక్షల్లో అప్పులు చేశాడు. దీంతో భార్య సరితతో గొడవలు తీవ్రం అయ్యాయి. ఈ క్రమంలోనే తన పేరిట ఉన్న 3 ఎకరాల్లో ఎకరా అమ్మేశారు. దీంతో కోటిన్నర రాజ్‌కుమార్ చేతికి వచ్చింది. ఆ తర్వాత విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంతోపాటు బాలికపై వేధింపులు తీవ్రతరం చేశాడు. మే 16న శంషాబాద్‌లోని బాలిక కాలేజీకి వెళ్లి అమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లి షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అరెస్ట్ చేయకుండా పోలీసుల నిర్లక్ష్యం..
బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు 78,351(2) బీఎన్‌ఎస్‌తో పాటు పోక్సో చట్టంలోని 11 రెడ్ విత్ 12 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లన్నీ ఏడేండ్లలోపు శిక్ష పడేవే కావడంతో రాజ్‌కుమార్ తన అన్న సహకారంతో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. పోక్సో కేసు నమోదైన తర్వాత రాజ్‌కుమార్ బాలిక కుటుంబాన్ని మరింత వేధించసాగాడు. ఈ క్రమంలో బాలిక తల్లి మరోసారి ఫిర్యాదు చేయడంతో రాజ్‌కుమార్‌ను తన సొంతూరు దైవాలగూడకు వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు.
దీంతో గత2 నెలలుగా రాజ్‌కుమార్ తన భార్య, పిల్లలతో సహా దైవాలగూడలోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్యతో విభేదాలు తీవ్రం కావడం, బాలిక తల్లి తనపై పోక్సో కేసు పెట్టడం వల్లే ఇదంతా జరుగుతోందన్న కక్షతో అవకాశం కోసం ఎదురుచూశాడు. బాలికతోపాటు ఆమె తల్లిని చంపుతానని బెదిరించడం మొదలు పెట్టాడు. బాలిక తండ్రిని కూడా తనే చంపానని భయాందోళనకు గురిచేశాడు. ఇలావారం రోజులుగా బాలిక కుటుంబంతో పాటు భార్యను హతమార్చేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు.
అరగంటలో ఆరు హత్యలు చేసి..
శుక్రవారం రాత్రి సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకున్నాడు. రాత్రి 11.10 గంటలకు బాలిక ఇంటికి వచ్చాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపు కొట్టడంతో బాలిక తల్లి డోర్ ఓపెన్ చేసింది. బాలికను తనతో లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో తల్లి అడ్డుపడింది. దీంతో తన చేతిలో కత్తితో కడుపు, ఛాతిలో ఆరు పోట్లు పొడిచాడు. నిద్రిస్తున్న బాలిక నాయనమ్మ రుక్కమ్మను పొడిచి చంపాడు. అరిస్తే చంపేస్తానని బెదిరిస్తూ.. బాలికను బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు.
సమీపంలోని అఖిల్‌సాగర్ చెరువు వద్ద ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం దైవాలగూడలోని తన ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టడంతో భార్య డోర్ ఓపెన్ చేసింది. దీంతో ఆమెపై దాడి చేసి కడుపులో బలంగా మూడు పోట్లు పొడిచాడు. అరవకుండా గొంతుకోశాడు. పక్కనే బెడ్‌పై నిద్రిస్తున్న పరీక్షిత్, దైవీక్షిత్ గొంతులు కోశాడు. ఇలా రాత్రి 11.10 గంటల నుంచి 11.45 గంటల మధ్య సమయంలో కేవలం అరగంట వ్యవధిలో ఆరు ప్రాణాలను తీశాడు.
ఆరుగురిని చంపాను.. నేనూ చస్తాను.. తండ్రికి రాజ్‌కుమార్ ఫోన్
ఆరు హత్యలు చేసిన అనంతరం 11.50 గంటల సమయంలో తండ్రి అరుణ్‌కుమార్‌కు ఫోన్ చేశాడు. ‘‘సరితతోపాటు ఆరుగురిని చంపాను.. నేను కూడా చనిపోతున్నా. మీరు అక్కడి నుంచి వెళ్లిపోండి”అని చెప్పాడు. దీంతో అరుణ్‌కుమార్ ఒక్కసారిగా హడలిపోయాడు. వెంటనే బాలిక ఇంట్లోకి వెళ్లి చూశాడు. అక్కడ బాలిక తల్లి లక్ష్మీ, నాయనమ్మ రుక్కమ్మ రక్తపు మడుగులో చనిపోయి కనిపించారు. వెంటనే తన భార్యతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అదే రూమ్‌లో ప్రాణాలతో మిగిలి ఉన్న బాలిక అక్కను అక్కడి నుంచి తరలించారు. మృతదేహాలను అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌కు పంపించారు.
అనంతరం దైవాలగూడలోని రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లారు. చిన్నారులతోపాటు రక్తపు మడుగులో ఉన్న సరిత డెడ్‌బాడీలను గుర్తించారు. రాజ్‌కుమార్ తీసుకెళ్లిన బాలిక కోసం వెతికారు. సమీపంలోని చెరువు వద్ద పడి ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అక్కడే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రాజ్‌కుమార్ కోసం 7 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. రాజ్‌కుమార్ పారిపోయిన కారును కొత్తూరు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని గూడూరుకు వెళ్లే దారిలో గుర్తించారు.
పోలీసులే కాపాడుతున్నారు
రాజ్‌కుమార్‌ను పోలీసులే కాపాడుతున్నారు. నా మేనకోడలిని లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసినా పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. ఈ ఏడాది మార్చి 4న బాలిక తండ్రి మల్లేశ్ చనిపోయాడు. ‘‘మల్లేశ్‌ను చంపినట్టే మిమ్మల్నీ చంపుతాను’ అని రాజ్‌కుమార్ మా కుటుంబాన్ని బెదిరించాడు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించారు. ఎస్ఐ రమేశ్, సీఐ కాంతారెడ్డి కేసును విచారించలేదు. పోలీసులపై చర్యలు తీసుకొని, మా కుటుంబానికి న్యాయం చేయాలి.
రాజు, బాలిక మేనమామ
బాధిత కుటుంబాలను ఆదుకుంటం
బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. బాధితులు ఇచ్చిన కంప్లైంట్‌లో ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం.
నారాయణరెడ్డి, కలెక్టర్, రంగారెడ్డి జిల్లా
లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశాం
రాజ్‌కుమార్ రాత్రి11 నుంచి 11:30 గంటల సమయంలో ఆరుగురిని హతమార్చాడు. 11.51 గంటలకు తండ్రికి ఫోన్ చేసి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. కారును గుర్తించాం. రాజ్‌కుమార్‌పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశాం. 7 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షలు రివార్డ్ అందిస్తాం. రాజ్‌కుమార్‌పై మే 16న కేసు నమోదైంది. పోక్సో కేసులో ఏడేండ్లలోపు జైలు శిక్ష ఉండటంతో అతనికి ముందస్తు బెయిల్ లభించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం.
తరుణ్ జోషి, సీపీ, ఫ్యూచర్ సిటీ
