రోస్టర్ విధానం సవరించే వరకు పోరాటం..ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

రోస్టర్ విధానం సవరించే వరకు పోరాటం..ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

పంజాగుట్ట, వెలుగు: తనకు పదవుల కంటే మాలల హక్కులే ముఖ్యమని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రోస్టర్ పాయింట్ల విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌‌‌‌లోని చింతల్‌‌బస్తీలో ది నేషనల్ అంబేద్కర్ సేన అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌‌‌‌రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని మంత్రి శనివారం సందర్శించి, సంఘీభావం తెలిపారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ మాలలు ఐక్యంగా ఉద్యమించి తమ హక్కులు సాధించుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా మాలలు అన్యాయానికి గురవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. రోస్టర్ పాయింట్లు సవరించి, మాలలకు దక్కాల్సిన ఐదు శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తాను పోరాటంలో ముందుంటానని భరోసా ఇచ్చారు. ఎస్సీ గ్రూప్3 లోని మాలలతో పాటు 25 ఉపకులాలకు మొదటి రోస్టర్ పాయింట్‌‌ను ప్రస్తుతం ఉన్న 22వ స్థానం నుంచి 16వ స్థానానికి మార్చాలన్నారు.

చేవెళ్ల డిక్లరేషన్‌‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మన్నె శ్రీధర్‌‌‌‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం కొసాగుతున్న ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.

నిరాహార దీక్షకు మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాల మహానాడు సీనియర్ నాయకులు రాజు వస్తాద్, మాల సంక్షేమ సంగం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, శ్రీనివాస్ రావు, హైకోర్టు న్యాయవాది కవల్​కుమార్ మద్దతు ప్రకటించారు. అంబేద్కర్ సేన నాయకులు తాలూకా రాజేశ్, కడారం యాదగిరి, శాస్త్రి ప్రవీణ్ కుమార్, గుమ్ముల కమల్ కుమార్, చెట్లపల్లి అరుణ్ కుమార్, దేవదాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీధర్‌‌‌‌రావు నిరాహార దీక్ష భగ్నం

మన్నె శ్రీధర్‌‌‌‌రావు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం రాత్రి 8.45 గంటల సమయంలో పోలీసులు దీక్షా శిబిరంలో ఉన్న మన్నె శ్రీధర్ రావుతోపాటు అంబేద్కర్​ సేన కార్యకర్తలను, ఆయన అనుచ రులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు తోపులాట జరిగింది. 

ఈ క్రమంలో అక్కడున్న మహిళలు పోలీసులు వాహనాలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డు తొలగించి శ్రీధర్​రావు తదితరులను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.