జిల్లాల్లో ఫర్టిలిటీ ఓపీ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు... జీజీహెచ్, జిల్లా హాస్పిటళ్లలో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం

జిల్లాల్లో ఫర్టిలిటీ ఓపీ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు... జీజీహెచ్, జిల్లా హాస్పిటళ్లలో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం
  • వారంలో ఒకరోజు సంతాన సమస్యలకు స్పెషల్ ఓపీ
  • ఆయా హాస్పిటళ్లలో సీనియర్ గైనకాలజిస్టుల సేవలు వినియోగం
  • సాధారణ సమస్యలకు జిల్లా స్థాయిలోనే చికిత్స 
  • ఐవీఎఫ్, ఐయూఐ అవసరమైతేనే గాంధీ, పేట్లబుర్జుకు రిఫర్ 

హైదరాబాద్, వెలుగు: సంతానం లేక ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుపేద దంపతులకు ఇకపై జిల్లా స్థాయిలోనే ప్రాథమిక ఫర్టిలిటీ చికిత్సలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ సమస్యలు అయితే జిల్లా హాస్పిటళ్లలోనే మందులతో ట్రీట్మెంట్ అందించాలని, ఐవీఎఫ్, ఐయూఐ వంటి చికిత్సలు అవసరమైనోళ్లనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గాంధీ, పేట్లబుర్జు వంటి ప్రభుత్వ హాస్పిటళ్లకు రిఫర్ చేసేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. 

ఇందులో భాగంగా సంతానానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలకు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించకుండా జిల్లాల్లోనే ఫర్టిలిటీ ఓపీ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నది. ఒకవేళ ఐవీఎఫ్, ఐయూఐ వంటి సేవలు అవసరం పడితే.. జిల్లా క్లినిక్స్ నుంచి గాంధీ, పేట్ల బుర్జు హాస్పిటళ్లలో ఉన్న ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్లకు రిఫర్ చేసేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్ లో ఒక చోట ప్రత్యేకంగా ఫర్టిలిటీ ఓపీ క్లినిక్ లను ప్రారంభించనున్నారు. 

దీనివల్ల ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్ల డోపిడీకి గురికాకుండా.. ప్రభుత్వ సెంటర్లలోనే ఉచితంగా, నాణ్యమైన సేవలను పొందుతారని ప్రభుత్వం భావిస్తున్నది.  

ప్రైమరీ చికిత్స.. జిల్లాల్లోనే

జిల్లాల్లో ప్రారంభమయ్యే ఈ ఓపీ క్లినిక్‌‌లలో సంతా నలేమితో బాధపడే దంపతులకు అవసరమైన అన్ని రకాల ప్రాథమిక పరీక్షలు ఉచితంగా చేస్తారు. పురుషులకు వీర్యకణాల పరీక్ష, మహిళలకు హార్మో న్ లోపాలను గుర్తించే రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి కీలకమైన డయాగ్నస్టిక్స్ సేవలను ఇక్కడే అందిస్తారు. 

చాలా మందికి కేవలం హార్మోన్ల అసమతుల్యత, చిన్నపాటి ఆరోగ్య సమస్యల వల్ల సంతానం కలగదు. అలాంటి వారికి జిల్లా స్థాయి లోనే ఫాలిక్యులర్ మానిటరింగ్ చేస్తూ, అవసరమై న మందులు ఇవ్వడం ద్వారా సహజ గర్భధారణకు అవకాశం కల్పిస్తారు. పీసీఓడీ వంటి సమస్యలతో బాధపడే మహిళలకు డైట్, వ్యాయామంపై అవగాహన కల్పిస్తూ ప్రాథమిక చికిత్సను జిల్లా కేంద్రాల్లోనే పూర్తి చేస్తారు.  

గైనకాలజిస్టుల సేవలు.. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో పని చేస్తున్న గైనకాలజిస్టులకు ప్రసవాలు, మెటర్నల్ సర్వీసుల్లో అపారమైన అనుభవం ఉంది. వారి నైపుణ్యాన్ని కేవలం డెలివరీలకే పరిమితం చేయకుండా, పెరుగుతున్న సంతానలేమి సమస్యల పరిష్కారానికి కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న గైనకాలజిస్టులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారంలో కనీసం ఒకరోజు ప్రత్యేకంగా  ఫర్టిలిటీ ఓపీ క్లినిక్  నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.  

అవసరమైతేనే గాంధీ, పేట్లబుర్జుకు.. 

జిల్లాల్లోని ఓపీ క్లినిక్​లలో ప్రాథమిక చికిత్సలు, మం దులు వాడినా ఫలితం లేకపోతే.. ఐవీఎఫ్, ఐయూఐ వంటి అధునాతన పద్ధతులు అవసరమని డాక్టర్లు భావిస్తేనే వారిని హైదరాబాద్‌‌ కు రిఫర్ చేస్తారు. దీనివల్ల హైదరాబాద్​లోని సెంటర్లపై రోగుల ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా నిజంగా ఐవీఎఫ్ అవసరమైన వారికి వేగంగా సేవలు అందుతాయి. గాంధీ, పెట్లబుర్జు ఐవీఎఫ్ సెంటర్లు ఇప్పటికే మంచి ఫలితాలు ఇస్తున్నాయి. 

ఇప్పటి వరకు 37,300 మందికి సేవ లు అందించారు. 23 మందికి ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిందని ఇటీవలే అధికారులు వెల్లడించారు. ఇదే స్పూర్తితో రెండో దశలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌‌నగర్, ఖమ్మం జిల్లాల్లో పూర్తిస్థాయి ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. త్వరలోనే ఈ ప్రత్యేక ఓపీ సేవలు జిల్లాల్లో అందుబాటులోకి రానున్నాయి.