SRH vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 'ఎలిమినేటర్' మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగడంతో హైదరాబాద్ ముందు 244 రన్స్ టార్గెట్ పెట్టింది.
29 బంతుల్లో 97 రన్స్.. వైభవ్ 'రాక్షస' బ్యాటింగ్:
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో హైలైట్ అంటే 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్సే. సన్‌రైజర్స్ బౌలర్లను టార్గెట్ చేస్తూ మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి స్టేడియాన్ని ఊపేసాడు. వరుస బౌండరీలతో చరిత్ర సృష్టించేలా కనిపించిన వైభవ్.. జస్ట్ 3 పరుగుల దూరంలో (97 వద్ద) ప్రఫుల్ హింగే వేసిన బౌలింగ్‌లో స్మరణ్ రవిచంద్రన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శతకం మిస్ అయినా ఐపీఎల్ నాకౌట్‌లో ఒక అద్భుత ఇన్నింగ్స్‌తో వైభవ్ అందరి మనసులు గెలుచుకున్నాడు. మరో ఎండ్‌లో చాలా నెమ్మదిగా ఆడిన యశస్వి జైస్వాల్‌ను శివాంగ్ కుమార్ డగౌట్‌కు పంపాడు.
జురెల్ మెరుపు హాఫ్ సెంచరీ:
ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కూడా రాజస్థాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ ఆరెంజ్ ఆర్మీ బౌలర్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగాడు. సన్‌రైజర్స్ బౌలర్లను ఉతికేస్తూ కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రఫుల్ హింగే బౌలింగ్‌లోనే అతడు అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్‌కు వచ్చి రాగానే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 12 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి రన్ రేట్ తగ్గకుండా చూశాడు. కానీ ప్రఫుల్ హింగే వేసిన స్లో బాల్‌కు బౌండరీ లైన్ వద్ద ఉన్న హెన్రిచ్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
చివర్లో తడబడ్డ మిడిల్ ఆర్డర్:
ఒక దశలో రాజస్థాన్ రాయల్స్ ఈజీగా 260+ స్కోరు చేసేలా కనిపించింది. కానీ జురెల్, పరాగ్ అవుట్ అయ్యాక ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు మ్యాచ్‌ను కాస్త కంట్రోల్‌లోకి తెచ్చారు. దాసున్ శనక ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం డోనోవన్ ఫెరీరా (12), నాండ్రే బర్గర్ (1) ఇద్దరూ రనౌట్ రూపంలో వికెట్లు సమర్పించుకున్నారు. అలాగే జోఫ్రా ఆర్చర్ (4) కూడా తక్కువ రన్స్ కే పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేస్తూ పరుగుల కోసం ప్రయత్నించినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 243 పరుగులే చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలోప్రఫుల్ హింగే అద్భుతంగా బౌలింగ్ చేసి కీలకమైన (వైభవ్ సూర్యవంశీ, జురెల్, పరాగ్) వికెట్లను పడగొట్టి హైదరాబాద్‌కు బ్రేక్ త్రూ ఇచ్చాడు.
