- కందకుర్తిలో హెడ్గేవార్ స్ఫూర్తి కేంద్రం ప్రారంభం
నిజామాబాద్, వెలుగు: దేశభక్తిని వ్యాప్తే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తున్నదని సంఘ్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. తాము ఎవరి మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదని.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ఉన్నతంగా పాటిస్తూ ఇతరుల సంప్రదాయాలను గౌరవిస్తామని చెప్పారు. శనివారం ఆయన రెంజల్ మండలం కందకుర్తి విలేజ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సంఘ్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రారంభించారు. ఆంగ్లేయుల పాలనతో పాటు ఇతర పాలకులందరి చేతిలో బానిసలైన హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్ ను స్థాపించారని గుర్తుచేశారు. లోపాలతో జీవిస్తున్నవారిని బలవంతులుగా, సచ్చీలురుగా తయారు చేయడానికి సంఘ్‌ను ఏర్పాటు చేశారన్నారు.
ఆజన్మాంతం భారతమాత దాస్య శృంకాల విముక్తి కోసం శ్రమించారని వెల్లడించారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో హెడ్గేవార్ స్మారక కేంద్రం ఉండగా ఆయన పూర్వీకులు నివసించిన కందకుర్తిలో కూడా వారసత్వ జ్ఞాపకాలను భవిష్యత్త్ తరాలకు అందించే ఉద్దేశ్యంతో స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఘనమైన చరిత్రగల కందకుర్తి గొప్పతనాన్ని నిలబెట్టాల్సిన అవసరం అందరిపై ఉందని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, సంఘ్ ప్రముఖులు పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఏవీఎన్‌రాజు, సురేందర్, దుర్గారెడ్డి, చామకూర సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
