నాగర్‌కర్నూల్, వెలుగు: పాత, కొత్త రాతియుగాలకు చెందిన మానవ జీవనశైలిని ప్రతిబింబించే అరుదైన రాతి చిత్రాలు నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం తుర్కలపల్లి గుట్టలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు తెలిపారు. తుర్కలపల్లి గ్రామం బయట ఉన్న చిన్న గుట్ట గుహల్లో ఈ చిత్రాలు ఉన్నట్లు యాదేశ్వర్ దంతేటికర్, కలగోని కిరణ్‌కుమార్ గౌడ్ గుర్తించారు. ఉత్తర అక్షాంశం 16.686861 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 78.658680 డిగ్రీల వద్ద ఈ ప్రదేశాన్ని కనుగొన్నారు. ఎరుపు, తెలుపు, నలుపు రంగులతో గీసిన ఈ చిత్రాలు వివిధ రాతియుగాలకు చెందినవని రాతి చిత్రాల నిపుణుడు బండి మురళీధర్ రెడ్డి తెలిపారు.
ఎరుపు రంగు చిత్రాలలో పెద్ద జంతువు, సరీసృపం, క్రాస్ గీతలు, కొమ్ముల ఆకారాలు, త్రిభుజాలు కనిపిస్తున్నాయి. మానవ ఆకృతులతో ఉన్న చిత్రాలు మెసోలిథిక్ కాలానికి చెందినవిగా గుర్తించారు. తెలుపు రంగు చిత్రాలలో కొమ్ములున్న మూపురపు ఎద్దు, మూపురం లేని ఎద్దు, పది ఆకులతో వృత్తాకారం ఉండగా, ఇవి నియోలిథిక్ కాలానికి చెందినవని పేర్కొన్నారు. నలుపు రంగు చిత్రాలలో ‘ఎక్స్’ గుర్తుతో దీర్ఘచతురస్రాలు, అర్ధ వృత్తాలు, జంతువుల ఆకృతులు, కత్తి పట్టుకున్న మానవులు, గుర్రంపై స్వారీ చేస్తున్న మనిషి, ఏనుగు ఆకారాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా కొత్త రాతియుగం నాటి రాతిపనిముట్లను పదును పెట్టుకునేందుకు ఉపయోగించిన నూరుడు గుంటలు కూడా పరుపు బండలపై కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
