
ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు ప్రగతిభవన్ వెళ్లని ఎమ్మెల్సీ కవిత.. తండ్రి, సీఎం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా బిడ్డకు.. దైర్యం చెప్పారాయన. నువ్వు అనుకున్న ప్రకారం ముందుకు వెళ్లు.. నీ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం కొనసాగించు అని స్పష్టం చేశారు. తండ్రి చెప్పిన మాటలతోనే.. అప్పటికప్పుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాటం కొనసాగించాలని.. అందుకు అన్ని విధాలుగా అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు తండ్రి కేసీఆర్.
విచారణ వాయిదా వేయాలంటూ రాసిన లేఖపై.. ఈడీ ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది వేచి చూద్దామని.. వారి సమాధానం ఆధారంగా స్పందించాల్సిన తీరుపై చర్చిద్దామని దైర్యం చెప్పారు కేసీఆర్. మార్చి 10వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లుపై దీక్ష చేయనున్నారు కవిత. ఈడీ విచారణకు రావాల్సిందే అని మళ్లీ స్పష్టం చేస్తే మాత్రం.. పరిణామాలు ఎలా ఉంటాయి.. కవిత ఎలా స్పందిస్తుంది.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.