సెక్రటేరియెట్ తరలింపుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

సెక్రటేరియెట్ తరలింపుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియట్ కు శంకుస్థాపన పూర్తి కావటంతో ఇప్పుడు శాఖల షిఫ్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏ శాఖను ఎక్కడకు తరలించాలనే దానిపై శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ శాఖ షిఫ్టింగ్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో కూడా స్పష్టం చేసింది. షిఫ్టింగ్ ప్రక్రియ కోసం ప్రతి శాఖకు నోడల్ అధికారులను నియమించింది. సచివాలయంలో శాఖల వారీగా పనిచేస్తున్న ఉద్యోగులను షిఫ్ట్ చేసిన తర్వాత కొత్త  కార్యాలయంలో ఎంత స్పేస్ అవసరముంటుందో అంచనా వేసింది. శాఖల వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను పేర్కొంది. షిఫ్ట్ చేసిన తర్వాత ఎంత స్పేస్ అవసరమన్న దానిపై అన్ని శాఖలను వివరణ కోరింది. ప్రస్తుత సచివాలయం కూల్చివేత జులై 31లోగా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎంత మంది?  ఎంత స్థలం?
ఒక్కో ఉద్యోగికి 200 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఉదాహరణకు 60 మంది ఉద్యోగులు ఉంటే 12 వేల చదరపు అడుగుల స్థలం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో షిఫ్టింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారనే దానిపై సోమవారం నుంచి అంచనా వేయనున్నట్లు తెలుస్తోంది. ఏ శాఖ ఎంత స్పేస్ ఉపయోగించుకుంటోంది, కొత్త ప్లేస్ కు వెళ్తే ఎంత ప్లేస్ అవసరం ఉంటుందన్న దానిపై నివేదికలు తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. సచివాలయం తరలింపుపై రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా ఉన్నారు. త్వరలో ఈ కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

షిఫ్టింగ్ ఖరారు కాని శాఖలు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, జీఏడీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, మెనార్టీ సంక్షేమం, ఐటీ శాఖ, రోడ్లు భవనాల శాఖ, ట్రైబల్ వెల్ఫేర్, యువజన సర్వీసుల శాఖ.