ధరణిలో కేసీఆర్​కుగుంట భూమి ఎక్కువ​పడ్డది

ధరణిలో కేసీఆర్​కుగుంట భూమి ఎక్కువ​పడ్డది
 
  • తమ పేరిట ఎక్కువ నమోదైనట్లు అఫిడవిట్​లో పేర్కొన్న సీఎం
  • ఉన్న ల్యాండ్ 53.30 ఎకరాలు.. రికార్డుల్లో 53.31 ఎకరాలు 
  • పోర్టల్​ ప్రారంభమై మూడేండ్లు దాటినా కొనసాగుతున్న తప్పులు
  • రాష్ట్రంలో వేలాది మంది భూ సమస్య బాధితులు

నెట్​వర్క్​, వెలుగు:  ధరణి పోర్టల్​లో సీఎం కేసీఆర్​కు గుంట భూమి ఎక్కువ​పడ్డది. తమ పాస్ బుక్స్,1బీ రికార్డులో గుంట భూమి అధికంగా చూపిస్తున్నట్లు స్వయంగా ఆయన తన ఎన్నికల అఫిడవిట్​లో వెల్లడించారు. ధరణి రికార్డుల ప్రకారం సీఎం కేసీఆర్ పేరిట సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో 36.1450 ఎకరాలు, ఇదే మండలం శివారు వెంకటాపూర్ లో10 ఎకరాల భూమి ఉండగా, శోభమ్మ పేరిట 7.1650 ఎకరాల భూమి ఉంది. ఇద్దరి పేరిట ఉన్న  మొత్తం భూమి కలిపితే 53.31 ఎకరాలు అవుతోంది. 


వాస్తవానికి తమ సేల్ డీడ్స్, పాత రికార్డుల ప్రకారం 53.30 ఎకరాలు మాత్రమే నమోదు కావాల్సి ఉండగా.. పాస్ బుక్, 1బీలో 53.31 ఎకరాలుగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆయన అఫిడవిట్ లో నోట్ పెట్టి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం పేరుతో గుంట భూమి ఎక్కువ నమోదైతే ధరణి పోర్టల్ లో ఇప్పటికీ ఎందుకు సరిచేయలేకపోయారనేది చర్చనీయాంశంగా మారింది. 

భూమి ఎక్కువ, తక్కువల సమస్యలు..

సీఎం కేసీఆర్ దంపతుల పాస్ బుక్స్ లాగే గుంట నుంచి కొన్ని ఎకరాల వరకు పాస్ బుక్స్​లో భూమి ఎక్కువ లేదంటే తక్కువగా నమోదైన వాళ్లు రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు. ఇదే సమస్యపై తహసీల్దార్లను, కలెక్టర్లను సంప్రదిస్తే పరిష్కారం చూపడం లేదు. టీఎం 33 మాడ్యుల్ లో  ఎక్సెంట్ కరెక్షన్/భూ విస్తీర్ణం సవరణ అనే ఆప్షన్ వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ అప్లై చేసుకున్నవారిలో చాలా మందికి డేటా కరెక్షన్ కావడం లేదు. ఎవరైనా తమకు గుంట, రెండు గుంటలు, అంతకంటే ఎక్కువ భూమి తమ పాస్ బుక్​లో నమోదు కాలేదని ధరణిలో అప్లై చేస్తే.. సదరు సర్వే నంబర్లలో ఎక్సెస్ ల్యాండ్ లేనట్లయితే తహసీల్దార్లు, కలెక్టర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. ఆ భూమి పక్కన వేరొకరి పేరిట నమోదై ఉండొచ్చని, తాము ఏం చేయలేమని తప్పించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎక్కువ భూమి నమోదైన వ్యక్తి  అంగీకారం తెలిపితేనే కలెక్టర్ తన లాగిన్ ద్వారా ఆ భూవిస్తీర్ణాన్ని డిలీట్ చేసి.. తక్కువ భూమి వచ్చిన వారి పేరిట నమోదు చే యడానికి అవకాశం ఉంటోంది. లేదంటే సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిందేనని ఆఫీసర్లు చెప్తున్నారు.

సమగ్ర భూ సర్వే నిర్వహించి ఉంటే..

సీఎం కేసీఆర్ తన పాస్ బుక్ లో గుంట భూమి ఎక్కువ చూపిస్తోందని అఫిడవిట్ లో స్వయంగా పేర్కొన్నారంటే.. ధరణి డేటాకు, వాస్తవ రికార్డుకు తేడా ఉందని ఆయనే ఒప్పుకున్నట్లయింది. మేం గ్రామాల్లో సదస్సులు నిర్వహించినప్పుడు ఇలాంటి సమస్యలు వందల్లో మా దృష్టికి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బాధితులు లక్షల్లో ఉన్నారు. ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ ఉండటం వల్లే ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. సీఎం కేసీఆర్ పాస్​బుక్​లో ఎక్కిన గుంట ఇంకెవరిదో అన్నట్లే  కదా. రెవెన్యూ రికార్డుకు, రిజిస్ట్రేషన్ రికార్డులకు పొంతన లేదు.  ధరణికి, టిప్పన్(కాడస్ట్రల్ మ్యాప్) కు లంకె కుదర్చాలి.  1954 నాటికి  తెలంగాణలో ఉన్న రికార్డుల్లో ఉన్న భూమి ఆ తర్వాత 64 ఏళ్లలో 65 లక్షల మేర పెరిగింది. ఇలా ఎక్సెస్ ల్యాండ్ ను రికార్డుల్లో సర్దుబాటు చేయడం భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఇబ్బందిగా మారింది. అప్పుడే సమగ్ర భూసర్వే నిర్వహించి ఉంటే.. ఎక్కువ, తక్కువ సమస్య వచ్చి ఉండేది కాదు. 
– భూమి సునీల్, భూచట్టాల నిపుణులు