ప్రజా వ్యతిరేకంగా కేసీఆర్ పాలన...మరో ఉద్యమానికి టైమొచ్చింది

ప్రజా వ్యతిరేకంగా కేసీఆర్ పాలన...మరో ఉద్యమానికి టైమొచ్చింది

తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో జరిగింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియమకాల్లో న్యాయం జరుగుతుందని పోరాడినం. ఇంటికో ఉద్యోగం వస్తదని, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ప్రజలు ఆకాంక్షించారు. అన్ని ఉద్యమ సంస్థలు, సబ్బండ వర్గాలు టీఆర్ఎస్ కు మద్దతు తెలిపాయి. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. బీజేపీ మద్దతు పలికింది. ప్రజలతో కలిసి పోరాడింది కనుక ఎన్నికల్లో టీఆర్ఎస్​ను గెలిపించారు. ఈ తొమ్మిదేండ్లలో ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. తెలంగాణకు తానే సర్వస్వం అంటూ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలు చేస్తున్నరు. ఉద్యమంలో వెంటనడిచిన సబ్బండ వర్గాలను మోసం చేసిన కేసీఆర్​ను గద్దె దించేందుకు మరో ఉద్యమం చేయాల్సిన టైమ్ వచ్చింది.

ప్రజా వ్యతిరేకంగా కేసీఆర్ పాలన 

ఈ తొమ్మిదేండ్ల పాలన ప్రజలు ఆశించినట్లు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగమా లేదా అన్నది క్రాస్ చెక్ చేయకుండా లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఏటా వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఒక లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని యువతను మోసం చేశారు. ఇపుడు పేపర్ లీకేజ్​తో లక్షల మంది జీవితాన్ని ఆగం చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయడంలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించారు. రైతులకు పంటల బీమా లేదు. పంటలు కొనే పరిస్థితి లేదు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతునే ఉన్నాయి.

బీఆర్ఎస్​కు తెలంగాణకు సంబంధం లేదు

టీఆర్ఎస్​ను రద్దు చేసి బీఆర్ఎస్ గా మార్చటాన్ని తెలంగాణ ఉద్యమ కారులు, 1969 ఉద్యమకారులం తీవ్రంగా ఖండిస్తున్నం. బీఆర్ఎస్​కు తెలంగాణకు సంబంధం లేదు. తెలంగాణ ప్రణాళికలను అమలు చేయదు. బీఆర్​ఎస్ ​ప్రభుత్వం ఉద్యమ కారులను ఇబ్బందులు పెడుతున్నది. 1969 ఉద్యమ కారులు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నా కేసీఆర్ కలవడానికి ఇష్టపడడం లేదు. ఉద్యమ కారుల జీవితాలు తెలిపే విధంగా 50 ఎకరాలు స్మృతి వనం ఏర్పాటు చేయాలి. 1948 ఉద్యమ కారుల్లో స్వామి రామనంద తీర్ధ, రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావులు కూడా తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారు. ఉద్యమ కారుల మీద కేసులను విత్ డ్రా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం.

ఎన్నికల కోసమే ఉత్సవాలు

తొమ్మిదేండ్లు పూర్తయితే దశాబ్ది ఉత్సవాలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. త్వరలో ఎలక్షన్స్ ఉడడంతో ప్రభుత్వ డబ్బుతో ప్రచారం చేసుకుంటున్నాడు. జిమ్మిక్కులు, మాటల గారడితో తొమ్మిదేండ్లలో రాష్ట్రాన్ని  నాశనం చేసిండు.  ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిండు. దళితులకు మూడు ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..ఇలా వేటిని అమలుచేయలేదు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవటం కోసం మరిన్ని కొత్త హామీలు ఇస్తున్నడు. తెలంగాణ మొత్తం నేనే.. నాదే క్రిడిట్ ఎవరిది ఏం లేదు.. అని ప్రచారం చేసుకోవడం కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనం. కేసీఆర్ ను దించేందుకు మరో ఉద్యమం చేయాల్సిన టైమ్ వచ్చింది.

మేచినేని కిషన్ రావు, ప్రెసిడెంట్, ఉద్యమ కారుల సమితి