కొండగట్టు ప్రమాదం: ఏడాదైనా ఎంక్వైరీ కాలె…ఇన్సూరెన్స్‌ అందలె

కొండగట్టు ప్రమాదం: ఏడాదైనా ఎంక్వైరీ కాలె…ఇన్సూరెన్స్‌ అందలె

పూర్తి కాని కొండగట్టు బస్సు ప్రమాద మృతుల ఫైనల్‌ రిపోర్ట్‌

కొండగట్టు బస్సు ప్రమాద కేసు ఎంక్వైరీ ఇంకా కొలిక్కి రాలేదు. గతేడాది సెప్టెంబర్ 11న కొండగట్టు ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో 65 మందికి పైగా దుర్మరణం చెందారు. సుమారు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో 19 మందికి ఇన్సూరెన్స్‌‌ ఉంది. వీరి ఇన్సురెన్స్ క్లెయిమ్ అవక బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

కేసు ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ ఇవ్వకపోవడంతో బాధిత కుటుంబాలు యాక్సిడెంటల్‌‌ డెత్‌‌ బెనిఫిట్‌‌ పొందలేకపోతున్నాయి. ఇన్సురెన్స్‌‌ కంపెనీల రూల్స్‌‌ ప్రకారం ఎవరైనా యాక్సిడెంట్‌‌లో చనిపోతే వారి కుటుంబానికి ఎఫ్‌‌ఆర్‌‌ఐ కాపీతో నార్మల్‌‌ఇన్సూరెన్స్‌‌ వస్తుంది. ఎంక్వైరీ పూర్తయ్యాక ఇచ్చే ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ కాపీ సబ్‌‌మిట్‌‌ చేస్తేనే యాక్సిడెంటల్‌‌ డెత్‌‌ బెనిఫిట్‌‌ అందజేస్తాయి. కొండగట్టు ప్రమాదంపై మూడు శాఖలు చేస్తున్న ఎంక్వైరీ నత్తనడకన సాగుతుండడంతో ఏడాది అవుతున్నా పూర్తి కావడం లేదు. మరోవైపు ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ లేక బాధిత ఇన్సురెన్స్ పొందలేక పోతున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఎంక్వైరీ ఎన్నడు కంప్లీటయ్యేనో…

కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్‌‌పై ప్రమాదస్థలానికి సమీపంలో షాపు నిర్వహిస్తున్న సోయం విక్రం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై రోడ్డు సేఫ్టీ అథారిటీలో భాగమైన రవాణా శాఖ, ఆర్‌‌ అండ్ బీ శాఖ, పోలీస్ శాఖలు కలిసి ఎంక్వైరీ చేపట్టాయి. ఏడాదిగా ఈ మూడు శాఖలు ఎంక్వైరీ చేస్తున్నా ఇప్పటికీ ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ పూర్తి కాలేదు. ఈ మూడు డిపార్ట్‌‌మెంట్ల మధ్య సరైన కో-ఆర్డినేషన్‌‌ లేకనే ఎంక్వైరీ పూర్తవడం లేదని ఆయా డిపార్ట్‌‌మెంట్ల వర్గాలే అంటున్నాయి. ఎంక్వైరీ తరువాత ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ ప్రకారం పోలీసులు కోర్టులో చార్జిషీట్‌‌ను దాఖలు చేస్తారు. దీన్ని విచారించిన కోర్టు తీర్పు వెలువరుస్తుంది. మూడు విభాగాలు కో-ఆర్డినేషన్‌‌తో రూపొందించిన ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ ఆధారంగానే బాధిత కుటుంబాలకు ఇన్సురెన్స్ అందుతుంది. మరోవైపు యాక్సిడెంట్‌‌ కేసులో దోషులను కాపాడేందుకే ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ రెడీ చేయడంలో జాప్యం జరుగుతోందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

‘‘నా పేరు లైశెట్టి శ్రీనివాస్.. మాది కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్య పల్లె. నా భార్య కళ కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతిచెం దింది.  ఆమె పేరు మీద  లైఫ్ ఇన్సురెన్స్ కట్టాం. నార్మ ల్​ ఇన్సూరెన్స్ రూ.30 వేలు అందించారు. ప్రమాదం జరిగినప్పుడు అందించే యాక్సి డెంటల్ బెన్​ఫిట్‌ రూ. 30 వేలు​ ఏడాది గడిచిన అందలేదు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ల ను అడిగితే యాక్సిడెంట్‌పై పోలీసులు ఇచ్చే రిపోర్ట్ ఇస్తే ఇస్తామంటున్నారు. ఏడాది గడిచినా ఆఫీసర్లు ఆ రిపోర్ట్‌ ఇస్తలేరు’’

“మాది కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామం. నా పేరు సంజీవ రెడ్డి. నా భార్య సురకంటి వనిత సాక్షర భారత్ కో ఆర్డీనేటర్‌గా పని చేసేది. కొండగట్టు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రభుత్వ సాయం అర కొరగానే అందింది. ప్రమాదం జరిగినప్పుడు ఎఫ్‌ఐఆర్ కాపీతో నార్మల్ ఇన్సూరెన్స్ రూ.1.30 లక్ష అందాయి. ఫైనల్‌ రిపోర్ట్‌ లేక యాక్సిడెంటల్ బెన్‌ఫిట్ రూ. 1.30 లక్ష​ ఏడాది గడిచినా అందలేదు’’

త్వరలోనే పూర్తి చేస్తాం

వివిధ డిపార్ట్‌‌మెంట్లతో కలిసి ఈ ఎంక్వైరీ చేపట్టాం. ఇప్పటికే కొన్ని రిపోర్ట్‌‌లు అందా యి. ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది. త్వరలోనే కంప్లీట్‌‌ చేసి ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ రెడీ చేస్తాం.
– సింధు శర్మ, ఎస్పీ, జగిత్యాల

న్యాయం జరిగేలా చర్యలు

ఫైనల్‌‌ రిపోర్ట్‌‌ రాక ఇన్సూరెన్స్‌‌ పొందలేకపోతున్న విషయం మా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. బాధితుల వివరాలు నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

– శరత్, కలెక్టర్, జగిత్యాల