
తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ స్వల్పకాలంలోనే, వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవితాలను గుణాత్మకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అత్యద్భుత ఫలితాలనిస్తున్నాయన్నారు. వ్యవసాయ రంగాన్ని నేడు పండుగలా మార్చడంతో పాటు, దేశానికే అన్నపూర్ణగా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అవతరించడం వెనుక ఎంతో శ్రమ, మేధోమథనం దాగి ఉన్నదని సీఎం తెలిపారు.
తెలంగాణకు అడుగడుగునా కేంద్రం అడ్డుపుల్ల
ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు అడుగడుగునా అడ్డుపుల్ల వేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం తన రాజ్యాంగబద్దమైన బాధ్యతను విస్మరించి, రాష్ట్రానికి ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా..రైతుసంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతుబంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం పునరుద్ఘాటించారు.
తెలంగాణ స్పూర్తితో దేశంలో కిసాన్ సర్కార్ అధికారంలోకి
రైతు సంక్షేమమే ధ్యేయంగా ఫలితాలను సాధిస్తున్న తెలంగాణ స్పూర్తితో దేశంలో కిసాన్ సర్కార్ అధికారంలోకి రావాల్సిన అవసరముందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్ ద్వారా మాత్రమే దేశ రైతాంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు అసలైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.