అవార్డులిస్తే పొంగిపోతరు.. వివరాలడిగితే దుమ్మెత్తిపోస్తున్నరు

 అవార్డులిస్తే పొంగిపోతరు.. వివరాలడిగితే దుమ్మెత్తిపోస్తున్నరు
  • కేంద్రంపై కేసీఆర్‌‌‌‌ సర్కారు తీరు 
  • అవార్డులు ఇస్తే పొంగిపోతున్న ప్రభుత్వ పెద్దలు
  • వివరాలు అడిగితే మాత్రం దుమ్మెత్తిపోస్తున్నరు
  • ప్రధాని, కేంద్ర మంత్రులను రిసీవ్‌‌‌‌ చేసుకోని సీఎం, మంత్రులు
  • స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌ అవార్డులు తీసుకోవడానికి ఢిల్లీకి కేటీఆర్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్రం పొగిడినప్పుడు, అవార్డులు ఇచ్చినప్పుడు ఉప్పొంగిపోతున్న కేసీఆర్ సర్కారు.. అదే కేంద్రం ఏవైనా వివరాలు ఇవ్వాలని అడిగినా, సర్కారు పరంగా చేయాల్సిన పనులను గుర్తు చేసినా ఇంతెత్తున ఎగిరి పడుతున్నది. కేంద్రం పొగిడితే శభాష్‌‌‌‌.. అడిగితే మాత్రం బద్మాష్‌‌‌‌ అన్నట్టుగా రియాక్ట్‌‌‌‌ అవుతున్నది. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్‌‌‌‌ రిసీవ్‌‌‌‌ చేసుకోవడమే లేదు. కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కేబినెట్‌‌‌‌ మినిస్టర్లు పట్టించుకోవడం లేదు. పైగా రాష్ట్రానికి ప్రధాని, హోం మంత్రి సహా కేంద్రం నుంచి ఎవరు వచ్చినా వారిని ప్రశ్నిస్తూ ట్వీట్లు పెట్టడం, వారికి వ్యంగ్యంగా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌‌‌‌లు ఏర్పాటు చేస్తున్నారు.

అసెంబ్లీతో పాటు అనేక వేదికలపై తెలంగాణ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలోకి విసిరికొట్టాలని సీఎం కేసీఆర్‌‌‌‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే కేంద్రం అవార్డులు ఇస్తే మాత్రం మంత్రులు పోటీపడి ప్రెస్‌‌‌‌మీట్లు పెడుతున్నారు. ట్విట్టర్‌‌‌‌ సహా ఇతర సోషల్‌‌‌‌ మీడియా వేదికగా తమ గొప్పలపై ప్రచారం చేసుకుంటున్నారు.

కేంద్రాన్ని బద్నాం చేయడానికే ప్రాధాన్యం

కేంద్ర ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 13 గ్రామీణ స్థానిక సంస్థలకు స్వచ్ఛ భారత్‌‌‌‌ అవార్డులు, 16 మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌ అవార్డులు, 3 మున్సిపాలిటీలకు ఇండియన్‌‌‌‌ స్వచ్ఛతా లీగ్‌‌‌‌ అవార్డులు ప్రకటించింది. మిషన్‌‌‌‌ భగీరథ పథకానికి జాతీయ అవార్డు అనౌన్స్‌‌‌‌ చేసింది. సంసద్‌‌‌‌ ఆదర్శ గ్రామ్‌‌‌‌ యోజన అవార్డుల్లోనూ కేంద్రం తెలంగాణకే పెద్దపీట వేసింది. ఏటా స్వచ్ఛ భారత్‌‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌‌ అవార్డులను రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఇస్తున్నది. ఇలా అవార్డులు ఇచ్చిన ప్రతిసారి ఆయా శాఖల మంత్రులు ప్రెస్‌‌మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఘనతను గొప్పగా చెప్పుకోవడం పరిపాటిగా మారింది.

అవార్డు సాధించిన శాఖల మంత్రులు, అధికారులను అభినందిస్తూ సీఎం కేసీఆర్‌‌ ప్రెస్‌‌నోట్లు రిలీజ్‌‌ చేస్తుంటారు. ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో చేస్తున్నది కాబట్టే కేంద్రం ఏ అవార్డులిచ్చినా అందులో ఎక్కువ మన రాష్ట్రానికే వస్తున్నాయని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిస్తే విమర్శలు చేస్తున్నారు. జిల్లాల్లో మెడికల్‌‌ కాలేజీల ఏర్పాటుకు డీపీఆర్‌‌లు ఇవ్వకుండా.. కేంద్రమే వివక్ష చూపిస్తున్నదంటూ ఆరోపణలు చేశారు. ఇలా అనేక అంశాల్లో కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ కేంద్రాన్ని బద్నాం చేయడానికే ప్రాధాన్యమిచ్చారు.

కేంద్ర మంత్రులొస్తే వ్యంగ్యంగా హోర్డింగ్‌‌లు.. విమర్శిస్తూ ట్వీట్లు

హైదరాబాద్‌‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే ఆ పార్టీ ప్రచారం చేసుకోవడానికి కనీసం హోర్డింగ్‌‌లు దక్కకుండా పక్కా ప్లాన్ ప్రకారం ప్రభుత్వపరంగా అన్నీ ముందే బుక్‌‌ చేసుకున్నారు. బీజేపీ బహిరంగ సభ నిర్వహించే పరేడ్‌‌ గ్రౌండ్‌‌ ఎదురుగా గులాబీ బెలూన్‌‌లు ఎగరేశారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌‌లో తెలంగాణ విమోచన ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వాటికి పోటీగా తెలంగాణ జాతీయ సమైక్యత పేరుతో పోటీ ఉత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వానికి హోర్డింగులు లేకుండా మన సర్కారే ముందుగా బుక్‌‌ చేసుకుంది.

ఈ ఉత్సవాలకు అటెండ్‌‌ అయ్యే కర్నాటక సీఎంకు ‘40 పర్సెంట్‌‌కు వెల్‌‌కమ్‌‌’ అంటూ వ్యంగ్యంగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చిన అనేక సందర్భాల్లోనూ ట్యాంక్‌‌ బండ్‌‌ సహా అనేక ప్రాంతాల్లో పలు డిమాండ్లతో కూడిన హోర్డింగ్‌‌లు ఏర్పాటు చేయించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే కేంద్ర మంత్రులు.. తెలంగాణకు ఫలానావి ఇచ్చాకే అడుగు పెట్టాలంటూ మంత్రులు కేటీఆర్‌‌, హరీశ్‌‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్లు చేయడం, బహిరంగ లేఖలు రాయడం పరిపాటిగా మారింది. దేశ రాజకీయాల్లోకి వెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్తున్న కేసీఆర్‌‌.. కేంద్రాన్ని తిట్టేందుకు అసెంబ్లీని వేదికగా మార్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రంపై విమర్శలకే పరిమితమవడం చర్చనీయాంశమైంది.

దారి ఖర్చులు దండగన్నరు..ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్‌లో..

ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ మీటింగ్‌పై గతంలో సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నాలుగు గంటల మీటింగ్‌లో నాలుగు నిమిషాలు మాట్లాడటం, పల్లీలు తినడం తప్ప దానితో ఒరిగేదేమీ లేదని విమర్శించారు. ఢిల్లీకి పోవడానికి దారి ఖర్చులు కూడా దండగేనని అప్పట్లో కేసీఆర్ అన్నారు. నీతి ఆయోగ్‌ మీటింగ్‌లే కాదు.. సదరన్‌ కౌన్సిల్‌ సమావేశాలకూ వరుసగా డుమ్మా కొడుతున్నారు. కానీ ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు తీసుకునేందుకు మంత్రి కేటీఆర్ స్పెషల్ ఫ్లయిట్‌లో ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చేతుల మీదుగా కేటీఆర్‌, అధికారులు అవార్డులు తీసుకోనున్నారు. గ్రామాలకు ఇచ్చిన అవార్డులతో పాటు మిషన్‌ భగీరథ అవార్డులు స్వీకరించడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఆయా శాఖల అధికారులు ఢిల్లీకి వెళ్తున్నారు.