
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ దూకుడును నిలువరించేందుకు కామ్రేడ్లతో కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మునుగోడు బహిరంగ సభ వేదికగా లెఫ్ట్ పార్టీలతో దోస్తీపై అధికారికంగా ప్రకటన చేశారు. సీపీఐ, సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకులతో గతంలో జరిపిన చర్చల్లోనూ వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసే పోటీ చేద్దామని కేసీఆర్ ప్రతిపాదించారు. సీపీఐ, సీపీఎంలకు ఐదేసి అసెంబ్లీ, ఒక్కో పార్లమెంట్ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్టు టీఆర్‌ఎస్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. వామపక్షాలు మరికొన్ని ఎమ్మెల్యే సీట్లు కోరుతుండటంతో వాటికి ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్యే కోటాలో ఒక్కో ఎమ్మెల్సీ సీటు ఇస్తామనే ప్రపోజల్ కామ్రేడ్ల ముందు పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో పొత్తుపై చివరి క్షణం దాకా నాన్చకుండా కొన్ని నెలల ముందే ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏయే స్థానాలు ఇస్తామనే దానిపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారని సమాచారం. సీపీఐకి నల్గొండ, సీపీఎంకు ఖమ్మం లోక్‌సభ సీట్లు ఇస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ సీట్లపై ఆయా పార్టీలతో మరికొన్ని పర్యాయాలు చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా ఉండేందుకే కేసీఆర్ కామ్రేడ్లతో జట్టు కట్టేందుకు సిద్ధపడ్డారని ప్రగతి భవన్‌తో సన్నిహితంగా ఉండే నేతలు చెప్తున్నారు.
బీజేపీని కట్టడి చేసేందుకే
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్‌ఎంసీలో అద్భుతమైన ఫలితాలతో బీజేపీ ఊపుమీద ఉంది. గతంతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ హవా క్రమేణ పెరుగుతోంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం తక్కువ. దీంతో ఇప్పుడు జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి బలం పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకే ముప్పు వస్తుందని గుర్తించిన కేసీఆర్.. బీజేపీని కట్టడి చేసేందుకు కామ్రేడ్లు సహా భావసారూప్యత ఉన్న పార్టీలతో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు. జాతీయ స్థాయిలోనూ బీజేపీని ఓడించేందుకు అనేక పార్టీలతో కలిసి పనిచేయా లని ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తామని లీకులు ఇచ్చినా దానికి బ్రేక్ వేశారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ, ప్రాం తీయ పార్టీలతో కలిసి పనిచేయడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థులకు మద్దతునిచ్చారు.
లెఫ్ట్ ఓటు బ్యాంకు కోసం
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఫ్రెండ్లీ పార్టీగా ఎంఐఎం ఉంది. ఆ పార్టీ పోటీ చేసే హైదరాబాద్ పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ సీట్లలోనూ టీఆర్‌ఎస్ క్యాండిడేట్లు బరిలోకి దిగుతున్నా.. వారి ప్రభావం నామమాత్రంగానే ఉండేలా కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంఐఎంకి తోడుగా సీపీఐ, సీపీఎంలను కలుపుకొని పోతే వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవచ్చనేది కేసీఆర్ ఎత్తుగడగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో రెండు, మూడు శాతం ఓట్లు కూడా కీలకమవుతాయని పీకే సర్వేల్లో తేలినట్టు సమాచారం. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకూ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల మంచి పట్టు ఉంది. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే వాళ్ల ఓటు బ్యాంకు భాగస్వామ్య పార్టీకి పక్కాగా ట్రాన్స్‌ఫర్ అయినట్టు గతంలో అనేక ఉదంతాలు ఉన్నాయి. అందుకే సీపీఐ, సీపీఎంలతో కలిసే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పైకి జాతీయ రాజకీయాల కోసమే పొత్తు అని చెప్తున్నా.. రాష్ట్ర ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించేందుకేననే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత అసెంబ్లీలో సీపీఐ, సీపీఎంలకు ప్రాతినిథ్యం లేదు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ ఒక్క సీటు కూడా వాటికి రాలేదు. అయినప్పటికీ ఆ రెండు పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు కోసం 2ఎంపీ, పది ఎమ్మెల్యేలు, రెండు ఎమ్మెల్సీ సీట్లను త్యాగం చేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తోనూ?
అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవసరమైతే కాంగ్రెస్‌తో పోస్ట్ పోల్ అలయన్స్‌కూ కేసీఆర్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్‌తో అధికారం పంచుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సింగిల్ లార్జెస్ట్‌గా పార్టీగా అత్యధిక స్థానాలు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు అవసరం అవుతుందేమోనని గులాబీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితే ఎదురైతే బీజేపీ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోకుండా కట్టడి చేసేందుకు కాంగ్రెస్‌తో కలిసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు.