ఆదిలాబాద్ జిల్లాలో రియల్టర్ల అక్రమాలకు అధికారుల అండ..వెలుగులోకి వస్తున్న బడా రియల్ వ్యాపారుల మోసాలు

 ఆదిలాబాద్ జిల్లాలో రియల్టర్ల అక్రమాలకు అధికారుల అండ..వెలుగులోకి వస్తున్న బడా రియల్ వ్యాపారుల మోసాలు
  • బల్దియా, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల్లో కొంత మంది చేతివాటం
  • భూ కబ్జాలపై కలెక్టర్, ఎస్పీ ఉక్కుపాదం 
  • మునుపెన్నడూ లేని విధంగా కేసులు 

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్ జిల్లాలో బడా రియల్ వ్యాపారుల అక్రమాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి భూకబ్జాలకు పాల్పడుతున్నారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన కొంతమంది అధికారులు, ఉద్యోగుల సహకారంతో రియల్టర్లు అమాయకులను మోసం చేస్తున్నారు. జిల్లాలో పేరు మోసిన రియల్టర్లతో పాటు కొంతమంది పొలిటికల్ లీడర్లు సైతం అమాయకులను బెదిరింపులకు గురిచేస్తూ తప్పుడు పత్రాలతో భూములను కబ్జా చేసి, రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

భూకబ్జాదారులపై ఎస్పీ ఉక్కుపాదం మోపుతుండడంతో ఈ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. అటు కలెక్టర్ సైతం తన దగ్గరకు వెళ్లిన ఫిర్యాదులకు త్వరగా స్పందిస్తూ మోసపోయిన బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఎస్బీఐ బ్యాంకు, ఈడీ ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసిన కేసులో జిల్లాలో పలుకుబడి ఉన్న రియల్ వ్యాపారులు రమేశ్ శర్మ, మామ్ లా సేట్​ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది.  

అధికారులు అండగా.. అక్రమాలు దండిగా

ఆదిలాబాద్​లో రిజిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖ కార్యాలయాల్లో కొందరు అధికారులు, ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవల ఏసీబీ దాడులు, పోలీసుల దర్యాప్తులతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని కేసుల్లో అధికారులు  లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతుండగా.. మరికొందరు భూముల కబ్జాలకు సహకరించి నకిలీ పత్రాలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్న కేసుల్లో పోలీసులకు చిక్కుతున్నారు. 

ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా పర్యవేక్షణ లేకపోవడంతో రూ.కోట్ల ఆస్తులు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆయా శాఖల్లో అధికారులు, రియల్ వ్యాపారులు కుమ్మక్కై  భూములను మాయం చేస్తున్నారు. ఆగస్టులో ఓ వ్యక్తి నుంచి గిఫ్ట్‌ డీడీ రిజిస్ట్రేషన్ కోసం రూ. 5 వేలు లంచం తీసుకుంటూ జాయింట్ సబ్ రిజిస్ట్రర్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. నిత్యం ఇలాంటి కేసులు జరుగుతున్నా వెలుగులోకి వస్తు న్నవి కొన్ని మాత్రమే.

ఇటీవల కొన్ని కేసుల్లో అధికారుల బాగోతం ఇలా..

జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 29/సీ సర్వే నెంబర్లలోని 7 ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మోసానికి పాల్పడిన కేసులో ఈనెల 20న పోలీసులు ఆర్​డబ్ల్యూ ఎస్ డీ ఈఈ నాలం వెంకటరమణ, రిమ్స్ ఆయూష్ విభాగం ఉద్యోగి సంజీవ్ కుమార్, మాజీ కౌన్సిలర్ రఘుపతిని  అరెస్ట్​ చేశారు. ఈ కేసులో రూ. 7 లక్షలు లంచం తీసుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రర్ అశోక్ పై సైతం కేసు నమోదైంది.  
    
ఈడీ, ఎస్​బీఐ బ్యాంకు ఆధీనంలో ఉన్న కోట్లు విలువ చేసే భూమిని అక్రమంగా కబ్జా చేసిన కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్​అయిన బడా రియల్టర్లకు సహకరించిన మండల సర్వేయర్ శివాజీపైనా కేసు నమోదైంది. సదరు సర్వేయర్ చేసిన అక్రమాల్లో పలువురు రెవెన్యూ అధికారుల పాత్రపై సైతం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు 
తెలుస్తోంది. 
    
గతంలో మున్సిపల్ కార్యాలయంలో పనిచేసిన ఓ అధికారి పక్క జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన పనిచేసిన సమయంలో మున్సిపల్ భూములకు అక్రమంగా అసెస్​మెంట్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో గత ఆగస్టులో ఆ అధికారిపై పోలీసులు కేసు పెట్టారు.