
- 162 మంది రైతులకు చెందిన 264 ఎకరాలకు రూ.33 కోట్లు
- ఎకరానికి రూ.12.50 లక్షలు చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం
- మంత్రి వివేక్ చొరవతో మొదటి విడతలో రూ.10 కోట్లు మంజూరు
- చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి రైతులకు త్వరలోనే చెక్కులు
- రెండో విడతలో మిగతా రైతులకు
మంచిర్యాల/చెన్నూర్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ కారణంగా భూములు మునిగిపోతున్న రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందనుంది. కోటపల్లి మండలం రాపనపల్లి, అర్జునగుట్ట, దేవులవాడ, రావులపల్లి గ్రామాల్లోని 162 మంది రైతులకు చెందిన 264 ఎకరాలను ముంపు భూములుగా గుర్తించారు. వీటికి ఎకరానికి రూ.12.50 లక్షల చొప్పున మొత్తం రూ.33 కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇందులో భాగంగా మొదటి విడతలో రూ.10 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసి డిసెంబర్ 18 తర్వాత చెక్కులు పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.
పట్టించుకోని గత ప్రభుత్వం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న రైతుల్లో కొంతమందికి పరిహారం అందించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరికొంత మందికి మొండిచేయి చూపింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని ముంపు భూములను అప్పటి ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేశారు. జైపూర్, చెన్నూర్ మండలాల్లోని 692.22 ఎకరాలకు 2016లో నష్టపరిహారం అందజేశారు.
సుందరశాల, నర్సక్కపేట, పొక్కూర్‌లో ఎకరానికి రూ.8.40 లక్షలు, బీరెల్లి, నాగపూర్, సోమనపల్లి, శివ్వారం గ్రామాల్లో ఎకరానికి రూ.10.60 లక్షల చొప్పున పరిహారం అందించారు. కానీ కోటపల్లి మండలంలోని ముంపు భూములను సర్వే చేసినప్పటికీ రైతులకు పరిహారం అందించకుండా గత ప్రభుత్వం చేతులు
దులుపుకుంది.
మంత్రి వివేక్ చొరవతో..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముంపు రైతుల సమస్యలపై కొట్లాడిన డాక్టర్జి.వివేక్ వెంకటస్వామి చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ అంశంపై ఫోకస్ చేశారు. కోటపల్లి మండలంలోని ముంపు రైతుల కష్టనష్టాలను అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కృషి ఫలితంగా ముంపు రైతులకు తొలివిడతలో రూ.10 కోట్లు మంజూరు అయ్యాయి.
దీంతో ఈ నెల 12న కలెక్టర్‌కుమార్ దీపక్‌తో పాటు సంబంధిత అధికారులతో కలిసి చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ముంపు రైతులతో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో సర్వే చేసిన లిస్ట్ ప్రకారం ఎకరానికి రూ.12.50 లక్షలు తీసుకునేందుకు రైతులు అంగీకరించారు. దీంతో వీలైనంత త్వరగా రైతులకు పరిహారం చెక్కులు అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. మిగతా రైతులకు రెండో విడతలో నష్ట పరిహారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
వివరాలు సేకరిస్తున్న అధికారులు
రాపనపల్లి, అర్జునగుట్ట, దేవులవాడ, రావులపల్లి గ్రామాల్లోని ముంపు రైతులకు పరిహారం అందించడానికి అధికారులు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రైతుల వివరాలు సేకరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సర్వే చేసిన లిస్ట్ ప్రకారమే రైతులకు పరిహారం అందించనున్నారు. ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించి రైతుల వివరాలు సేకరించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆఫీసర్లను ఆదేశించడం తెలిసిందే.
అప్పటి లిస్ట్ ప్రకారం ఎవరైనా రైతులు భూములు అమ్ముకున్నారా ? మరెవరైనా రైతులు చనిపోయారా ? అని వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా రైతుల భూములు ముంపునకు గురైతే వారి పేర్లు నమోదు కాకపోయినా, లిస్ట్‌లో ఉన్న రైతుల భూమి ఎక్కువ ఉండి.. రికార్డుల్లో తక్కువ నమోదు అయినా రెవెన్యూ సదస్సుల్లో నమోదు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం రూ.10 కోట్లు మాత్రమే మంజూరు కావడంతో ముందుగా ఎలాంటి వివాదాలు లేని రైతులకు చెక్కులు ఇవ్వనున్నారు. వివాదాస్పద భూములను రెండో విడతలో తీసుకుంటామని స్పష్టం చేశారు.
అర్హులందరికీ పరిహారం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన అర్హులైన రైతులందరికీ పరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట చేలు, కొన్ని నివాస ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు ఎంతో నష్టపోయారు. ముంపు బాధితులకు గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి విడతలో రూ.10 కోట్లు మంజూరు చేసింది. మిగతా వారికి సెకండ్ ఫేజ్‌లో ఇస్తాం.
- జి.వివేక్ వెంకటస్వామి, మంత్రి
ముందుగా పట్టాభూములకు..
అర్హులైన ముంపు రైతులందరికీ పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముందుగా ఎలాంటి వివాదాలు లేని భూములకు అవార్డు జారీ చేస్తాం. డిసెంబర్ 18, 19 తేదీల్లో పరిహారం అందిస్తాం. భూ సంబంధిత వివాదాల్లో రాజీ అయిన వారికి రూల్స్ ప్రకారం చెల్లింపులు జరుపుతాం. లేకపోతే పరిహారం డబ్బులను కోర్టులో డిపాజిట్ చేస్తాం. మొత్తం రూ.33 కోట్లలో రూ.5 కోట్లు మంజూరు కాగా, మరో రూ.5 కోట్లు పీడీ అకౌంట్‌లో ఉన్నాయి.
- కుమార్ దీపక్, మంచిర్యాల కలెక్టర్