ఆస్తి పంపకాల్లో లొల్లి.. తల్లి అంత్యక్రియలు ఆపిన కూతుళ్లు

ఆస్తి పంపకాల్లో లొల్లి..  తల్లి అంత్యక్రియలు ఆపిన కూతుళ్లు
  • పోలీసుల జోక్యంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియలు
  • సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్‌‌‌‌)లో ఘటన

సూర్యాపేట, వెలుగు : ఆస్తి పంపకాల్లో ఇద్దరు కూతుళ్ల మధ్య తేడాలు రావడంతో మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు ఆపేశారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పడంతో గురువారం అంత్యక్రియలు పూర్తి చేశారు.  ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు (ఎస్)కు చెందిన పొదిల నరసమ్మ (85)కు ఇద్దరు కూతుర్లు, పెద్ద కూతురు వెంకటమ్మ, చిన్న కూతురు కళమ్మ.

 నరసమ్మ భర్త గతంలోనే చనిపోగా ఆమె ఒంటరిగా ఉంటోంది. తనకున్న ఆస్తిలో ఇద్దరు కూతుళ్లకు రూ. కోటి మేర పంచి ఇవ్వగా.. మిగతా డబ్బులు, బంగారాన్ని తనవద్దే ఉంచుకుంది. నరసమ్మ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో డబ్బు, బంగారాన్ని చిన్న కూతురు వద్ద దాచిపెట్టింది. ఈ క్రమంలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ మూడు రోజుల కింద చనిపోయింది. 

దీంతో కళమ్మ వద్ద దాచి పెట్టిన డబ్బులతో అంత్యక్రియలు చేయాలని పెద్ద కూతురు వెంకటమ్మ కోరగా.. అది ఇష్టం లేని కళమ్మ తల్లి డెడ్‌‌బాడీ వద్దకు రాలేదు. ఇద్దరి మధ్య గొడవ కారణంగా మూడు రోజులుగా అంత్యక్రియలు చేయకుండా డెడ్‌‌బాడీని ఇంటి వద్దే ఉంచారు. 

స్థానికులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అక్కాచెల్లెలు వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకొని వెంకటమ్మ, కళమ్మతో మాట్లాడి అంత్యక్రియలు పూర్తి చేయించారు.