జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. మీనాక్షి నజరాజన్

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. మీనాక్షి నజరాజన్
  • రాహుల్​ను ప్రధానిని చేసే సంకల్పం ఇక్కడి నుంచే స్టార్ట్​ కావాలి: మీనాక్షి నజరాజన్
  • నవీన్​ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపు
  • జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బూత్ స్థాయి సమావేశాలు
  • హాజరైన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్​జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. రాహుల్ ను ప్రధానిని చేసే సంకల్పాన్ని ప్రజలు ఇక్కడి నుంచే తీసుకోవాలని ఆమె కోరారు. బిహార్​లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. 

గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌‌‌‌పేట, రహ్మత్ నగర్, సోమాజిగూడ డివిజన్లలోని బూత్ స్థాయి సమావేశాల్లో ఆమె పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపు కోసం డివిజన్లలో ఎవరైతే కష్టపడుతారో వాళ్లకే పార్టీ పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు.

 ‘‘కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చే బాధ్యత మాది.. కానీ, కాంగ్రెస్​ను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలది”అని ఆమె చెప్పారు. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ 
చిత్తశుద్ధిని మనం చూశామని, కాంగ్రెస్ ఏ విషయంలోనైనా సరే మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటుందని అన్నారు.

 అందరి అభిప్రాయాల మేరకే నవీన్ యాదవ్​ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించామని, ఆయ​న్ను గెలిపించి మన చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. నవీన్​గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు కావాల్సింది సెంటిమెంట్ కాదు.. అభివృద్ధి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 

జూబ్లీహిల్స్ ప్రజలకు కావాల్సింది సెంటిమెంట్ కాదని.. వారికి అభివృద్ధి కావాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ శకం ముగిసిందని, జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి చేరనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం మేరకే నవీన్ యాదవ్​ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించామని, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే నాయకుడు నవీన్ అని అన్నారు. ఆయన్ను గెలిపించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. 

కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బహుమతిగా ప్రజలు నవీన్  యాదవ్ ను గెలిపించాలని కోరారు. 

కంటోన్మెంట్​ సీన్​ రిపీట్: మంత్రి పొన్నం

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా అక్కడి ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టి కాంగ్రెస్​ను గెలిపించారని.. ఇప్పుడు జూబ్లీహిల్స్​లో కూడా అదే ఫలితం పునరావృతం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 

బూత్ ఇన్​చార్జీలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరును ప్రత్యక్షంగా కలవాలని.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, నవీన్ యాదవ్​ను గెలిపిస్తే మరింత అభివృద్ది చేసుకోవచ్చన్నారు.