
- ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
- రోజుకు అదనంగా వెయ్యి టన్నుల బొగ్గు వెలికితీత
- దేశంలోనే మూడు కంటిన్యూయస్ మైనర్‌లు నడిచే గనిగా జీడీకే రికార్డు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 11వ గనిలో ఇప్పటికే రెండు కంటిన్యూయస్ మైనర్(సీఎం) మెషిన్లు నడుస్తుండగా, మూడో మెషిన్‌ను హైరింగ్ పద్ధతిలో ప్రవేశపెట్టేందుకు సింగరేణి ముందడుగు వేసింది. ఇందుకోసం రూ.100 కోట్లతో టెండర్లు ఆహ్వానించగా.. పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మూడో మెషిన్‌ను ఏర్పాటు చేసి ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది.
ఈ మెషిన్ ద్వారా ప్రతి రోజు అదనంగా వెయ్యి టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా ఆఫీసర్లు ప్లాన్ చేశారు. దేశంలోని బొగ్గు సంస్థలన్నింటిలోనూ మూడో కంటిన్యూయస్ మైనర్మెషిన్ నడిచే మైన్‌గా జీడీకే11వ గని రికార్డుల్లోకి ఎక్కబోతోంది. అలాగే సింగరేణి వ్యాప్తంగా అండర్గ్రౌండ్మైన్లలో ఏటా ఒక మిలియన్ టన్నులు సాధించే ఏకైక గనిగా కూడా పేరు తెచ్చుకోబోతోంది.
తట్టా చెమ్మస్ నుంచి కంటిన్యూయస్ మైనర్ దాకా..
సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని గోదావరిఖని 11వ గనిని 1979లో ఏర్పాటు చేయగా, 1985 నుంచి బొగ్గు వెలికితీయడం ప్రారంభించారు. మొదట్లో ఈ గనిలో తట్టా చెమ్మస్ (బోడ్ అండ్ ఫిల్లర్) పద్ధతిలో బొగ్గు వెలికితీశారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేసేవారు. 1991 నుంచి 2003 వరకు లాంగ్ వాల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టగా, 2002 నుంచి 2020 వరకు బ్లాస్టింగ్ గ్యాలరీ (బీజీ) పద్ధతిలో బొగ్గు ఉత్పత్తి చేశారు. 2008లో మొట్టమొదటిసారిగా కంటిన్యూయస్ మైనర్ మెషిన్‌ను ఇంట్రడ్యూస్ చేశారు.
మెషిన్‌ను ఉన్న పళ్ల యంత్రం నిరంతరం బొగ్గును తొలుస్తూ కింద పడేస్తే అక్కడి నుంచి బెల్ట్ ద్వారా నిర్దేశించిన ప్లేస్‌కు చేర్చుతారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతున్నందున దీనిని కంటిన్యూయస్ మైనర్మెషిన్గా పిలుస్తున్నారు. ఆ తర్వాత 2021లో ఇదే గనిలో రెండో కంటిన్యూయస్ మైనర్ మెషిన్‌ను ప్రారంభించారు. ఈ మెషిన్ రోజుకు వెయ్యి టన్నుల వరకు బొగ్గును వెలికితీస్తుంది. ఈ రెండు మెషిన్లు సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తాజాగా హైరింగ్ పద్ధతిలో మూడో మెషిన్‌ను గనిలోకి దింపేందుకు టెండర్ ప్రక్రియను సింగరేణి ఆహ్వానించింది.
350 మీటర్ల లోతులో ఉన్న బొగ్గు కోసం..
సాధారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో 300 మీటర్ల లోతు వరకు ఉన్న బొగ్గును బ్లాస్టింగ్చేసి వెలికితీస్తారు. జీడీకే 11వ గనిలో 350 మీటర్లు ఆపైన లోతులో ఉన్న బొగ్గును వెలికితీయడానికి మూడో కంటిన్యూయస్ మైనర్ మిషిన్‌ను ప్రవేశపెట్టాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో రాబోయే ఏడేండ్లలో ఈ గనిని, ఓపెన్‌కాస్ట్3, ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్ట్‌లు విలీనం కానున్నాయి. ఈక్రమంలో ఈ గనిలో ఓపెన్‌కాస్ట్ విధానం ద్వారా వెలికితీయలేని లోతుగా ఉన్న బొగ్గు నిల్వలను బయటకు తీసేందుకు మేనేజ్‌మెంట్ ఆరేండ్లపాటు ఈ మిషిన్‌ను హైరింగ్పద్ధతిలో నడపనుంది.
40 ఏళ్లల్లో వెలికితీసింది 20.50 మి.టన్నులే..
జీడీకే 11వ గనిలో మొత్తం 53 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 40 ఏండ్లలో 20.50 మిలియన్‌టన్నుల బొగ్గును మాత్రమే వెలికితీశారు. ఇంకా 32.50 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయాల్సి ఉంది. ఏటా మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే మూడో కంటిన్యూయస్ మైనర్మెషిన్ను రంగప్రవేశం చేస్తున్నారు. ఏడేళ్ల వరకు భూగర్భ గనిగా నడిచిన తర్వాత ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లో విలీనం చేయనున్నారు. అప్పుడు మరింత బొగ్గును వెలికితీసే
వీలు ఏర్పడుతుంది.
జీడీకే 11వ మైన్‌ను లాభాల్లోకి తీసుకువచ్చేందుకే...
సింగరేణిలో అండర్గ్రౌండ్మైన్లు అన్నీ దాదాపుగా నష్టాల్లో నడుస్తున్నాయి. ఒక టన్ను బొగ్గు వెలికితీసి అమ్మితే కనీసంగా రూ.6 వేల వరకు నష్టం వస్తోంది. అందుకే భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించాలనే ఆలోచనతో జీడీకే 11వ గనిలో మూడో కంటిన్యూయస్ మైనర్‌ను హైరింగ్ పద్ధతిలో ప్రవేశపెడుతున్నాం. టెండర్‌ప్రక్రియ మొదలైంది. పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుంది. -డి.లలిత్‌కుమార్, ఆర్జీ 1 ఏరియా జీఎం