‘గిరిజన బంధు’ ఇస్తం

‘గిరిజన బంధు’  ఇస్తం

హైదరాబాద్: వారం రోజుల్లో రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా జీవో రిలీజ్ చేస్తామని, అలాగే ‘గిరిజన బంధు’ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజన ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చామని చెప్పారు. గిరిజనుల కోసం గురుకులాలు, విదేశీ విద్యా నిధి కింద రూ.20 లక్షలు, యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ‘సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్’ పథకం కింద ఆర్థికసాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని పోడు భూములకు త్వరలోనే పట్టాలు ఇస్తామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా గిరిజనులకు మంచి నీళ్లు అందిస్తున్నామన్నారు. అలాగే ప్రతి గిరిజన తండాకు త్రీ ఫేజ్ కరెంట్ సరఫరా చేస్తున్నామని సీఎం చెప్పారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి  గిరిజనుల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఏడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమోదించలేదని చెప్పారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు.. తాము పంపించిన గిరిజన రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని మోడీ, అమిత్ షాను ప్రశ్నించారు. దయచేసి తమ బిల్లులను ఆమోదించాలని మోడీకి కేసీఆర్ దండం పెట్టి వేడుకున్నారు. విభజన రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతోందని బీజేపీపై మండిపడ్డారు. ఈ 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని కేసీఆర్ ఆరోపించారు. ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ప్రాజెక్ట్  ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు మోడీ దోచిపెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు.