ప్రజాప్రతినిధులు, అధికారులు అలర్ట్గా ఉండాలె

ప్రజాప్రతినిధులు, అధికారులు అలర్ట్గా ఉండాలె

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించిన సీఎం..ఇవాళ మరోసారి వర్షాలపై ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో కృష్ణ, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోల గురించి ఆరాతీస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.  ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలపై సీఎం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు 

కడెం ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తోందని..సాధ్యమైనంత వరకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నా ఇంకా వరద పెరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. అక్కడే వుండి సహాయ చర్యల్లో పాల్గొంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం ఫోన్లో పలు సూచనలు చేశారు. వరదలకు తెగిపోతున్న జాతీయ , రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అక్కడే వుండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని కేసిఆర్ సూచించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితి గురించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో సీఎం సమీక్షించారు. వరదలు తగ్గిన వెంటనే రైతులకు  కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. విద్యుత్  ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేసుకోవాలని విద్యుత్ శాఖ సిఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సిఎండీ శ్రీధర్ లను సీఎం కేసిఆర్ ఆదేశించారు. ప్రాజెక్టులకు చేరుకుంటున్న వరదను బట్టి అవకాశమున్న చోట హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించాలన్నారు. వానలు వరదల నేపథ్యంలో చేపట్టే సహాయక చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదలచేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.