ప్రీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్

ప్రీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్
  • అందరూ క్రీస్తు మార్గంలో పయనించాలని కామెంట్
  • త్వరలో క్రైస్తవ పెద్దలతో జాతీయ స్థాయి సమావేశం
  • ‘జై తెలంగాణ’ నినాదం లేకుండా ప్రసంగం ముగించిన సీఎం

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతటా జరగాలని సీఎం కేసీఆర్  అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో  నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. కులం, మతం, జాతి, వర్గం అనే తేడాలు లేకుండా అన్ని పండగలను ఉన్నంతలో గొప్పగా జరుపుతున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. త్వరలో క్రైస్తవ పెద్దలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహిస్తానని  తెలిపారు. పొరుగువారిని ప్రేమించాలని శాంతి సందేశం ఇచ్చిన దేవుని బిడ్డ క్రీస్తు అని కొనియాడారు. 

క్రైస్తవంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండవన్నారు. కరుణ, దయ, జీవితం గురించి అన్ని మతాల పెద్దలు ప్రచారం చేయాలని కోరారు. క్రీస్తు మార్గంలో అందరూ  పయనించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాల కార్యక్రమాలు దేశానికి దిక్సూచి అని సీఎం అన్నారు. కాగా, ఏ సభలోనైనా ప్రసంగం తర్వాత జై తెలంగాణ అని ముగించే కేసీఆర్.. ఈసారి ఆ నినాదం లేకుండానే ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు తో పాటు పలువురు 
మంత్రులు పాల్గొన్నారు.