బంగారు తెలంగాణ త్వరలోనే వస్తది

బంగారు తెలంగాణ త్వరలోనే వస్తది

వికారాబాద్: తాను కలలు కన్న బంగారు తెలంగాణ త్వరలోనే వస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...రాష్ట్రం ఏర్పడకపోతే ఇవాళ వికారాబాద్ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో నవ్విన వాళ్లు ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పారు. ఉద్యమంలో లేనోళ్లు అడ్డుపొడుగు మాట్లాడుతున్నారని, మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారని, ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. 57ఎండ్ల నిండిన 10 లక్షల మందికి నిన్నటి నుంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఎన్నికలు వస్తే రకరకాల వాళ్లు వస్తుంటారని, ప్రజలు అన్నీ విని ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులతో ఇప్పుడున్న పరిస్థితులను బేరీజ్ వేసుకోవాలని కోరారు. 

తెలంగాణను గుంటనక్కలు వచ్చి పీక్కతినకుండా ప్రజలు జాగ్రత్తపడాలన్న సీఎం... మోసపోతే గోసపడే పరిస్ధితులు వస్తాయని చెప్పారు. 58 ఏళ్లు సమైక్య పాలనలో గోస పడ్డామని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లు అధికారంలో ఉండి మోడీ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని నిలదీశారు. మేలు చేయకపోగా రైతు బంధు వంటి పథకాలు ఉచిత పథకాలని, వాటిని రద్దు చేయాలని కోరుతున్నారని తెలిపారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మితే మోటర్లకు మీటర్లు వస్తాయన్నారు. మన సంపదను మొత్తం దోచి పెద్ద పెద్ద షావుకారులకు ఇస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సవాల్ విసిరారు. రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న కేసీఆర్... రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు.